Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ గెస్ట్‌ హౌస్ సీజ్

By:  Tupaki Desk   |   18 Dec 2018 4:28 AM GMT
ప్ర‌భాస్ గెస్ట్‌ హౌస్ సీజ్
X
డార్లింగ్ ప్ర‌భాస్ కి తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్ షాకిచ్చింది. రాయ‌దుర్గం ప‌రిస‌రాల్లోని ప్ర‌భాస్ అతిధి గృహాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేయ‌డం సినీ వ‌ర్గాల్లో వాడి వేడిగా చ‌ర్చ‌కు తావిచ్చింది. రాయ‌ దుర్గం గ్రామ రెవెన్యూ స‌ర్వే నంబ‌రు 46లో గ‌ల 84 ఎక‌రాల 30 గుంట‌ల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా కోర్టు కేసు న‌డుస్తోంది. దీని పై కోర్టు తీర్పు వెలువ‌డి ప‌రిష్కారం ల‌భించ‌డంతో శేరిలింగంప‌ల్లి త‌హ‌శీల్దారు వాసుచంద్ర ఆ స్థలాన్ని ప్ర‌భుత్వ ఆధీనంలోకి తెచ్చారు. ఆ స్థ‌లంలోనే ప్ర‌భాస్ కు చెందిన అతిధిగృహం ఉండ‌డంతో దానిని అధికారులు సీజ్ చేశార‌ని తెలుస్తోంది.

ఈ స్థ‌ల వివాదంలో బోలెడ‌న్ని మెలిక‌లు కోర్టు తీర్పు నేప‌థ్యంలో బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇది పూర్తిగా వివాదాస్ప‌ద స్థ‌లం. ప్ర‌భాస్ అతిధి గృహం ఉన్న స్థ‌లం ప్ర‌యివేట్‌ వ్య‌క్తుల‌కు చెందుతుంద‌ని, దీనిపై ప్ర‌భుత్వానికి ఎలాంటి హ‌క్కు లేద‌ని మాల రాములు- నీరుడు ల‌క్ష్మ‌య్య కోర్టులో వాద‌న‌లు వినిపించారు. దీంతో న్యాయ‌స్థానం వీరికి అనుకూలంగా తీర్పును వెలువ‌రించింది. ఆ క్ర‌మంలోనే ఆ భూమిని ల‌బ్దిదారుల పేర్ల‌ పై ప‌ట్టా చేయాల‌ని ఆదేశాలున్నా అప్ప‌టి త‌హ‌సీల్దారు స్పందించ‌క‌పోవ‌డంతో స‌మ‌స్య మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. దీంతో శివ‌రామ‌కృష్ణ అనే వ్య‌క్తి మ‌రోసారి న్యాయ‌ స్థానాన్ని ఆశ్ర‌యించాడు. ఆ క్ర‌మం లోనే ఆగ్ర‌హించిన కోర్టు స‌ద‌రు త‌హ‌సీల్దారు పై ధిక్కార‌ణ కింద శిక్ష విధించింది.

ఇన్ని మ‌లుపులు తిరిగాక మ‌రోసారి స‌ద‌రు త‌హ‌శీల్దారు అత్యున్న‌త‌ ధ‌ర్మాస‌నాన్ని ఆశ్ర‌యించి బ‌లంగా వాద‌న‌లు వినిపించ‌డంతో అత‌ని వాద‌న‌ను బ‌ల‌ప‌రుస్తూ ఉన్న‌త న్యాయ‌స్థానం తాజాగా తీర్పునిచ్చింది. దీంతో తిరిగి ఆ స్థ‌లం ప్ర‌భుత్వ స్వాధీనంలోకి వ‌చ్చింది. ఇంత‌టి వివాదాస్ప‌ద స్థ‌లంలో ప్ర‌భాస్ గెస్ట్ హౌజ్ ఉండ‌డం వ‌ల్ల‌నే ఈ చిక్కులు అని తెలుస్తోంది. రెండోసారి ప‌గ్గాలు చేప‌ట్టిన గులాబీ అధినేత‌లు ఇక‌పై న‌గ‌రంలో ఎలాంటి అవినీతిని స‌హించేది లేద‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ స్థ‌ల వివాదం తెర‌పైకి రావ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో, జాన్ చిత్రాల షూటింగుల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.