Begin typing your search above and press return to search.

మెగా హీరో సినిమాలకి అడ్డంకిగా మారిన ప్రభాస్..?

By:  Tupaki Desk   |   15 April 2021 3:30 AM GMT
మెగా హీరో సినిమాలకి అడ్డంకిగా మారిన ప్రభాస్..?
X
కరోనా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత వచ్చిన సినిమాలకు ప్రజాదరణ లభించడంతో, టాలీవుడ్ లో మేకర్స్ అందరూ వరుస పెట్టి కొత్త సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు. అయితే ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల రీత్యా చాలా సినిమాల విడుదలలు వాయిదా పడుతున్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు పెరుగుతుండటంతో థియేట‌ర్ల ఆకుపెన్సీని మళ్ళీ 50 శాతానికి త‌గ్గిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక - తమిళనాడు - మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో అమలుపరుస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పెద్ద సినిమాలన్నీ వెన‌క్కి వెళ్లిపోతున్నాయి. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌దేలే అంటూ ముందుకు వ‌స్తున్నాడు.

డార్లింగ్ నటించిన లేటెస్ట్ మూవీ 'రాధే శ్యామ్' ను జూలై 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అదే రోజున మెగా హీరో వ‌రుణ్ తేజ్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'గ‌ని' కూడా విడుద‌ల కానుంది. 'రాధే శ్యామ్' జూలై 30 కే రావాలని ఫిక్స్ అయితే మాత్రం.. 'గ‌ని' వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అదే కనుక జరిగితే ఆగస్ట్ లో రిలీజ్ డేట్ లాక్ చేసి పెట్టుకున్న వ‌రుణ్ తేజ్ మ‌రో మూవీ 'ఎఫ్ 3' కూడా వాయిదా వేయాల్సి ఉంటుంది. అంటే పరోక్షంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. వ‌రుణ్ తేజ్ నటించే రెండు సినిమాల‌కి అడ్డంకనే అనుకోవాలి. మరి రాబోయే రోజుల్లో రిలీజ్ డేట్స్ విషయంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి.

ఇక 'గ‌ని' విష‌యానికొస్తే.. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ లవ్ స్టోరీకి డెబ్యూ డైరెక్టర్ కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో బాక్సింగ్ డ్రామాలు వ‌చ్చి చాలా రోజులు అయింది. 'త‌మ్ముడు' 'అమ్మన్నాన్న ఓ త‌మిళమ్మాయి' వంటి సినిమాలు త‌ప్పితే ఈ మధ్య కాలంలో బాక్సింగ్ డ్రామాలు పెద్దగా రాలేదు. మ‌రి 'గ‌ని' తో వ‌రుణ్ తేజ్ ఎలా మెప్పిస్తాడో చూడాలి. మ‌రో వైపున విజయ్ దేవరకొండ 'లైగ‌ర్' సినిమా కూడా బాక్సింగ్ నేపథ్యంలోనే రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.