Begin typing your search above and press return to search.

'కనీసం రూ.50 పెట్టి సినిమా చూడండి సార్'.. ప్రభాస్ ఫన్నీ ఆన్సర్..!

By:  Tupaki Desk   |   5 March 2022 9:43 AM GMT
కనీసం రూ.50 పెట్టి సినిమా చూడండి సార్.. ప్రభాస్ ఫన్నీ ఆన్సర్..!
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన సినిమా ''రాధేశ్యామ్''. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ - సాంగ్స్ అన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల వదిలిన 'రాధేశ్యామ్' రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది.

విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. పాన్ ఇండియాకి తగ్గట్టుగా పలు ప్రధాన నగరాల్లో స్పెషల్ గా ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ముంబైలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సక్సెస్ అయింది. ఇదే క్రమంలో చెన్నైలో జరిపిన ప్రెస్ మీట్ కూడా విజయవంతమైంది.

చెన్నైలో పుట్టి పెరిగిన ప్రభాస్ అనర్గళంగా తమిళంతో మాట్లాడి ఆకట్టుకున్నారు. విలేఖరులు అడిగినవాటికి సౌమ్యంగా సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ 'రాధేశ్యామ్' యొక్క క్లైమాక్స్ లో జరుగుతుందో ముందే తెలుసుకోవాలనుకుని అడిగిన ప్రశ్నకు ప్రభాస్ ఆసక్తికరమైన ఆన్సర్ ఇచ్చాడు.

“క్లైమాక్స్ లో లవ్ గెలుస్తుందా లేక డెస్టినీ గెలుస్తుందా?” అని విలేఖరి అడిగిన దానికి ప్రభాస్ స్పందిస్తూ “అది నేను ఏలా చెప్తా సార్.. కనీసం రూ.50 టిక్కెట్ అయిన కొనుక్కుని సినిమా చూడండి” అని ఫన్నీగా బదులిచ్చారు. ఇక అందరూ నవ్వుతుండగానే సినిమా నిర్మాణ బడ్జెట్ రూ. 300 కోట్లు అని.. ఇప్పుడు తాను క్లైమాక్స్ గురించి చెప్తే చంపేస్తారని చెప్పి డార్లింగ్ నవ్వులు పూయించారు.

యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ''రాధేశ్యామ్'' సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో పామిస్ట్ విక్రమాదిత్యగా ప్రభాస్ కనిపించనున్నారు. ఇందులో కృష్ణంరాజు - భాగ్యశ్రీ - మురళీ శర్మ - సచిన్‌ ఖేడ్‌కర్‌ - జయరామ్ - ప్రియదర్శి - సత్యరాజ్ - కునాల్ రాయ్ క‌పూర్‌ - ఎయిర్ టెల్ శాషాఛ‌త్రి - రిద్ది కుమార్‌ - స‌త్యన్ కీలక పాత్రలు పోషించారు.

'రాధేశ్యామ్' చిత్రాన్నికృష్ణంరాజు సమర్పణలో గోపీ కృష్ణ మూవీస్‌ తో కలిసి యూవీ క్రియేషన్స్‌ - టీ సిరీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చగా.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రఫీ అందించగా.. ఆర్‌.రవీందర్‌ ప్రొడక్షన్‌ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. ప్రభాస్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ ప్రేమకథా చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.