Begin typing your search above and press return to search.

స్పెషల్: ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ...

By:  Tupaki Desk   |   23 Oct 2016 11:31 AM GMT
స్పెషల్: ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ...
X
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా - కాదు కాదు ప్రపంచ వ్యాప్తంగా స్టార్ హీరో అయిపోయారు యంగ్ రెబల్ స్టార్. ప్రభాస్ గురించి వార్త రాస్తూ ఎవరో ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ అని మొదలుపెట్టారెందుకంటారా? టాలీవుడ్ డార్లింగ్ పేరు అదే కదా మరి. "ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు" తెలుగు ప్రేక్షకులకు డార్లింగ్ - ప్రపంచానికి బాహుబలి! ఆదివారం 37వ వసంతంలో అడుగుపెట్టిన ఈ టాలీవుడ్ రెబల్ స్టార్ నటవారసుడు సూర్యనారాయణ రాజు - శివకుమారి దంపతుల ముద్దుల కొడుకు.

14 ఏళ్ల నట ప్రస్థానంలో అసాధారణమైన అద్భుతాలను సొంతం చేసుకున్న ఈ హీరో ఖాతాలో ఇప్పటికే పలు విజయవంతమైన సినిమాలు ఉన్నప్పటికీ "బాహుబలి" తో ఒక్కసారిగా గ్లోబల్‌ స్టార్‌ గా ఎదిగిపోయాడు. ఆదివారం (23-10-2016) న డార్లింగ్ ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

బాహుబలితో ప్రపంచానికి టాలీవుడ్ సత్తా చాటిన ప్రభాస్.. ఆ సినిమ సూపర్‌ సక్సెస్‌ తో ఇక బాలీవుడ్‌ లోనూ సినిమాలు చేస్తాడని టాక్. అయితే ఇప్పటికే అజయ్‌ దేవగణ్‌ హీరోగా ప్రభుదేవా తెరకెక్కించిన "యాక‌్షన్‌ జాక్సన్‌" సినిమాతో అతిథిగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం అందరికీ బాహుబలి అయిన ఈ హీరోకి బాగా నచ్చిన సినిమా తన పెద్దనాన్న కృష్ణంరాజు నటించిన "భక్తకన్నప్ప". ఇక బాలీవుడ్ విషయానికొస్తే... దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరానీ సినిమాలు అంటే పడిచస్తాడు. మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ - త్రి ఇడియట్స్‌ సినిమాలను 20సార్లకుపైగా చూసిన అనుభవం ప్రభాస్ సొంతం. ఇక హాలీవుడ్‌ విషయానికొస్తే రాబర్ట్‌ డీనీరో నటన అంటే ఇష్టం.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ప్రభాస్‌ కు విశాఖ కు చెందిన ఒక బిజినెస్ మేన్ కుమార్తెతో పెళ్లి ఓకే అయ్యిందని, తల్లిదండ్రులు ఎంపిక చేసిన అమ్మాయినే ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడని గాసిప్స్ వచ్చాయి. అయితే ఆ విషయాలను అధికారికంగా ఇప్పటివరకూ ప్రభాస్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ స్పందించింది లేదు. ఇదే సమయంలో ఆ అమ్మాయి గురించి ఇప్పటివరకూ పెద్దగా వివరాలు బయట ప్రపంచానికీ తెలియలేదు. కాకపోతే గత ఏడాది డిసెంబర్‌ లోనే ప్రభాస్‌ పెళ్లి జరగాల్సి ఉండగా... "బాహుబలి" ప్రాజెక్టు కారణంగా వాయిదా వేసుకున్నాడని మాత్రం తెలుస్తోంది.

క్రీడల విషయానికొస్తే... ప్రభాస్‌ కు వాలీబాల్‌ అంటే మహా ఇష్టం. బాహుబలి సినిమా కోసం మిస్టర్‌ వరల్డ్‌ 2010 లక్ష్మణ్‌ రెడ్డి ప్రత్యేకంగా దేహాదారుఢ్యంపై ప్రభాస్‌ కు శిక్షణ ఇచ్చారు. కండలు తిరిగిన దేహసౌష్ఠవం కోసం చిత్ర నిర్మాతలు ప్రత్యేకంగా రూ. 1.5 కోట్లు విలువచేసే జిమ్‌ ఎక్విప్‌ మెంట్స్‌ అందించారు. చాలామంది నటులు వరుసగా సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపుతుండగా ప్రభాస్‌ మాత్రం ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాపై దృష్టి పెడుతున్నాడు. అంటే... "బాహుబలి" సముద్రం లాంటి సినిమా కాబట్టి మధ్య మధ్యలో నదిలాంటి సినిమాలను ఇవ్వడం ఆయనకు ఇష్టంలేదన్న మాట!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/