Begin typing your search above and press return to search.

కరోనా పై యుద్ధానికి ప్రభాస్ భారీ విరాళం

By:  Tupaki Desk   |   26 March 2020 12:23 PM GMT
కరోనా పై యుద్ధానికి ప్రభాస్ భారీ విరాళం
X
ప్రపంచాన్నే వణికించేస్తున్న కరోనా మహమ్మారి తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనాపై అన్ని దేశాలు కూడా గట్టిగా యుద్ధాన్ని ప్రకటించాయి. ముందుగా ప్రజలను తమ ఇళ్లకు పరిమితం చేసేలా లాకౌట్ ప్రకటించిన పలు దేశాలు, ఎవ్వరూ కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని, అలానే ఎవరికి వారు తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తేనే త్వరితగతిన ఈ వ్యాధిని అరికట్టగలం అని నిర్ణయించాయి. అయితే దీనివలన ప్రజలందరూ ఎటువంటి పనులు లేక ఇంటికే పూర్తిగా పరిమితం కావాల్సి వచ్చింది, దానితో ఇల్లు గడిచే పరిస్థితి లేక పేద - దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.

అయితే వారిని ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది. వారికి తోడుగా ప్రముఖ పారిశ్రామికవేత్తల నుంచి సినీ సెలబ్రిటీల వరకూ తమ వంతు సాయం చేస్తున్నారు. కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. కరోనాపై పోరాటానికి తెలుగు సినిమా హీరో నితిన్ తో మొదలైన ఆర్ధికసాయం ఇప్పుడు ఊపందుకుంది. అందులో భాగంగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి - సూపర్ స్టార్ మహేష్ బాబు - రామ్ చరణ్ - మంచు మనోజ్ - రాజశేఖర్ - అల్లరి నరేష్ - దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ - కొరటాల శివ - వివి వినాయక్ - అనిల్ రావిపూడి వంటి వారు ముందుకు వచ్చి తమ వంతుగా విరాళాలు అందించడం జరిగింది.

తాజాగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా భారీగానే విరాళం అందించాడు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఏకంగా కోటి రూపాయల విరాళం అందించాడు. దాంతో పాటు కరోనా వైరస్ అరికట్టడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు - చేస్తున్న చర్యలపై ప్రశంసించాడు. ఇటువంటి కష్ట పరిస్థితుల్లో ప్రజలను తనవంతుగా ఆదుకోవడం తన బాధ్యత అని, మిగతా వారు కూడా తమ స్తోమత మేరకు ప్రజలకు చేయూతను అందించాలని, అలానే ఇటువంటి పరిస్థితుల్లో ఎవరూ కూడా బయటకు రాకుండా ఇళ్లవద్దనే ఉండి ప్రభుత్వానికి సహకటించాలని ప్రభాస్ కోరారు.