Begin typing your search above and press return to search.

అధికారులను నియంత్రించండి: ప్రభాస్

By:  Tupaki Desk   |   20 Dec 2018 5:58 AM GMT
అధికారులను నియంత్రించండి: ప్రభాస్
X
సినీనటుడు ప్రభాస్ కు చెందిన గెస్ట్ హౌస్ ను ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే.. దీనిపై నటుడు ప్రభాస్ నిన్న హైకోర్టులో అత్యవసర లంచ్ మోషన్ పిటీషన్ వేశారు. తన ఆస్తి విషయంలో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోకుండా చూడాలని.. ఈ భూమిపై ఎటువంటి వివాదాలు లేవని.. తాను ఈ భూమిని 2005లో బి. వైష్ణవి రెడ్డి - ఉషా - బొమ్మిరెడ్డి శశాంక్ రెడ్డిల నుంచి చట్టబద్దంగా కొనుగోలు చేశానని హైకోర్టులో వేసిన పిటీషన్ లో ప్రభాస్ విన్నవించారు.

అంతేకాదు.. ఈ గెస్ట్ హౌస్ పై తాను క్రమం తప్పకుండా ఆస్తి పన్ను - విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నాని తెలిపారు. ఎలాంటి వివాదాలు లేకున్నా.. ముందస్తు జాగ్రత్త చర్యగా క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకొని రూ.1.05 కోట్ల ఫీజు కూడా చెల్లించానని ప్రభాస్ పిటీషన్ లో పేర్కొన్నారు. క్రమబద్దీకరణ దరఖాస్తు పరిశీలనలో ఉండగానే.. రెవెన్యూ అధికారులు వచ్చి ప్రభుత్వ భూమిగా చెబుతూ తన ఆస్తిని సీజ్ చేశారని ప్రభాస్ తెలిపారు.

ఈ ఆస్తి వివాదం విషయంలో కనీసం తన వాదనలు వినడం కానీ.. నోటీసులు ఇవ్వడం కానీ రెవెన్యూ అధికారులు చేయలేదని ప్రభాస్ పేర్కొన్నారు. అధికారుల చర్యలు తన హక్కులను హరించే విధంగా ఉన్నాయని.. అందువల్లే వారిని నియంత్రించాలని కోర్టును కోరారు.

ఇది సివిల్ వివాదం కావడంతో న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ ధర్మాసనానికి బదిలీ చేశారు. ఇలాంటి కేసులు ధర్మాసనం ముందున్నాయని.. ఈ విషయాన్ని రిజిస్ట్రీ సైతం నిర్ధారిందని పిటీషన్ ను ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ వాజ్యంపై అత్యవసరంగా విచారించే పిటీషన్ కానందున గురువారం విచారిస్తామని తెలిపారు.