Begin typing your search above and press return to search.

ప్రభాస్ బాహుబలికి సంతకం చేసేసినా..

By:  Tupaki Desk   |   16 Aug 2015 1:30 PM GMT
ప్రభాస్ బాహుబలికి సంతకం చేసేసినా..
X
బాహుబలి సినిమా ప్రభాస్ కు ఎంత ప్రతిష్టాత్మకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘రెబల్’ సినిమా తర్వాత ప్రభాస్ ఒప్పుకున్నది బాహుబలే. రాజమౌళికి ఇచ్చిన మాట కోసం రెండు మూడేళ్ల పాటు ఇంకో సినిమా గురించి ఆలోచించని చెప్పేశాడు. కానీ అనుకోకుండా ‘మిర్చి’ సినిమా లైన్ లోకి వచ్చింది. ‘బాహుబలి’ లాంటి మెగా హిట్ కు ముందు శాంపిల్ అన్నట్లు ‘మిర్చి’ కూడా సూపర్ హిట్ అయింది. ప్రభాస్ కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయింది. అసలు ప్రభాస్ మనసంతా బాహుబలి మీదే ఉండగా కొరటాల అతణ్ని ‘మిర్చి’కి ఎలా ఒప్పించగలిగాడు? ఆ సినిమా ఎలా కార్యరూపం దాల్చింది. ఈ విశేషాలు కొరటాల శివ మాటల్లో విందాం పదండి.

‘‘ఊసరవెల్లి సినిమాకు మాటలు రాస్తున్న సమయంలో దర్శకుడిగా మారుదాం అనిపించింది. మిర్చి నిర్మాత వంశీ నాకు మంచి స్నేహితుడు. అప్పటికతను పంపిణీదారుడు. మరో మిత్రుడు ప్రమోద్ కూడా నిర్మాత కావాలనుకుంటున్నట్లు చెప్పాడు. ప్రభాస్ వీళ్లిద్దరికీ మిత్రుడు. ఆయన్ని పెట్టి సినిమా తీయాలనుకుంటున్నారు. పేరున్న దర్శకుడిని పెట్టుకుంటారనుకున్నా. కానీ తమకు కథే ముఖ్యమన్నారు. కథ చెప్పాను. నచ్చిందన్నారు. ప్రభాస్ కు కథ వినిపించడానికి వెళ్లాం. ఆయన అప్పటికే బాహుబలికి సంతకం చేశారు. ‘నా దగ్గర టైం లేదు. కథ నచ్చితే ఏంటి పరిస్థితి’ అన్నాడు. ఏదోలా కథ వినడానికి ఒప్పుకున్నాడు. విన్నాక కథ బాగుందని.. ఇప్పుడు తనేం చేయాలో అర్థం కావట్లేదని చెప్పాడు. రాజమౌళిని అడిగితే.. బాహుబలి మొదలవడానికి ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాను. అలా మిర్చి సినిమా మొదలైంది. విడుదల తర్వాత మా అంచనాలకు మించి విజయం సాధించింది’’ అని కొరటాల చెప్పాడు.