Begin typing your search above and press return to search.

‘సాహో’ ఎప్పుడవుతుంది.. ఎప్పుడొస్తుంది?

By:  Tupaki Desk   |   21 May 2018 4:06 AM GMT
‘సాహో’ ఎప్పుడవుతుంది.. ఎప్పుడొస్తుంది?
X
‘బాహుబలి’ లాంటి లైఫ్ టైం మూవీ తర్వాత ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం ‘సాహో’. ఈ సినిమాపై కేవలం తెలుగువాళ్లే కాక దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంపై ఉన్న అంచనాల దృష్ట్యా చిత్ర బృందం ఎంతమాత్రం దీన్ని తేలిగ్గా తీసుకునేలా కనిపించడం లేదు. మూడేళ్ల పాటు సుజీత్ ‘సాహో’కు స్క్రిప్టు తీర్చిదిద్దితే.. ఏడాది ముందు నుంచే ప్రి ప్రొడక్షన్ పనులు జరిగాయి. ఇక షూటింగ్ కోసం ఏడాదిన్నరకు పైగా సమయం వెచ్చిస్తున్నారు. నెలన్నర కిందటే ఈ చిత్రం కోసం దుబాయిలో భారీ షెడ్యూల్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. 70 రోజుల ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు. విరామం లేకుండా దీని కోసం పని చేసిన ఈ చిత్రం బృందం ప్రస్తుతం చిన్న విరామం తీసుకున్నట్లు సమాచారం.

కొన్ని రోజుల తర్వాత తిరిగి షూటింగ్ మొదలుపెడతారట. ఈ షెడ్యూల్ పూర్తయితే సినిమా 60 శాతం దాకా పూర్తయినట్లే అంటున్నారు. ఈ ఏడాది డిసెంబరు కల్లా షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఆరు నెలలు వెచ్చిస్తారట. ఇందులో విజువల్ ఎఫెక్టులకు చాలా ప్రాధాన్యం ఉంటుందని.. అందుకోసమే 50-60 కోట్ల మధ్య ఖర్చు చేయబోతున్నారని సమాచారం. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి వచ్చే ఏడాది ఆగస్టులో తెలుగుతో పాటు తమిళం.. మలయాళం.. హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటిస్తుండగా.. ఇంకా బాలీవుడ్ నుంచి నీల్ నితిన్ ముఖేష్.. జాకీష్రాఫ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం అందిస్తున్న ‘సాహో’ను ప్రభాస్ మిత్రులైన వంశీ-ప్రమోద్ ‘యువి క్రియేషన్స్’ బేనర్ మీద ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని బడ్జెట్ దాదాపు రూ.200 కోట్లని తెలుస్తోంది.