Begin typing your search above and press return to search.

సాహో టీంకు పెద్ద షాక్ తగిలింది

By:  Tupaki Desk   |   18 Dec 2017 7:04 AM GMT
సాహో టీంకు పెద్ద షాక్ తగిలింది
X
‘సాహో’ సినిమా ఆరంభం కావడానికి ముందు నుంచి ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ గురించి చాలా చర్చ జరుగుతోంది. హాలీవుడ్ నిపుణుల ఆధ్వర్యంలో కళ్లు చెదిరే యాక్షన్ సీక్వెన్స్ తీయబోతున్నారని.. ఆ ఎపిసోడ్‌ కు మాత్రమే రూ.35-40 కోట్ల దాకా ఖర్చవుతుందని.. సినిమాకు ఇదే ప్రధాన ఆకర్షణ అని అన్నారు. ముందు ఈ ఎపిసోడే చిత్రీకరిస్తారని.. ఆ తర్వాత మిగతా సీన్లు తీస్తారని అన్నారు. కానీ అలా ఏమీ జరగలేదు. మొదట వేరే సన్నివేశాలు తీశారు. దుబాయిలో ఈ వారమే ఆ యాక్షన్ సీక్వెన్స్ తీయడానికి అన్న ఏర్పాట్లు చేశారు. 75 రోజుల పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్ తీయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రి ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసుకుని హాలీవుడ్ టీంతో రెడీ అయ్యాడు దర్శకుడు సుజీత్.

కానీ వీళ్లు అనుకున్నది.. జరిగింది ఒక్కటి. దుబాయిలో వీళ్లు షూటింగ్ చేయాలనుకున్న ప్రాంతాల్లో అనుమతి లభించలేదు. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా ప్రాంతాల్లో డిస్టబెన్స్ లేకుండా చిత్రీకరణ చేసుకోవడానికి అనుమతుల కోసం ప్రయత్నించగా.. అక్కడి ప్రభుత్వం నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు. అనేక రకాలుగా ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడే పని కాదని తేలింది. దీంతో ఒక టీంను ఆ పని మీద పెట్టి.. దుబాయి నుంచి చిత్ర బృందం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయినట్లు సమాచారం. జనవరి రెండో వారం నుంచి హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ చేసి.. దుబాయిలో చిత్రీకరణకు అన్ని అనుమతులూ వచ్చాక ఆ ఎపిసోడ్ షూట్ చేసుకుంటారట. ఈ లోపు మిగతా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేయాలని డిసైడయ్యారు. బహుశా సమ్మర్లో మంచి ఎండల మధ్య దుబాయిలో చిత్రీకరణకు వెళ్తుందోమో ‘సాహో’ టీం.