Begin typing your search above and press return to search.

అవును..నా పారితోషకం ఎక్కువే-ప్రభుదేవా

By:  Tupaki Desk   |   1 Oct 2016 11:30 AM GMT
అవును..నా పారితోషకం ఎక్కువే-ప్రభుదేవా
X
నటులైనా.. టెక్నీషియన్లయినా పారితోషకం మాటెత్తితే చాలు ముడుచుకుపోతారు. నేను అంతేమీ తీసుకోవట్లేదనో.. ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటున్నాననో రొటీన్ డైలాగులు పేల్చుతుంటారు. ఐతే ఈ మధ్య తమన్నా మాత్రం ‘జాగ్వార్’ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం భారీగానే పారితోషకం తీసుకుంటున్నట్లు అంగీకరించింది. రెమ్యూనరేషన్ గురించి కొంచెం ఓపెన్‌ గా స్టేట్మెంట్లు కూడా ఇచ్చింది. మరి తమ్మూతో కలిసి ‘అభినేత్రి’ చేస్తూ ప్రభావితం అయ్యాడో ఏమో.. ప్రభుదేవా సైతం తన పారితోషకం విషయంలో ఇలాంటి కామెంటే చేశాడు. తన పారితోషకం కొంచెం ఎక్కువే అని చెప్పాడు.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా బాలీవుడ్లో ఎక్కువ పారితోషకం తీసుకున్న దర్శకుల్లో మీరొకరట కదా అని ప్రభుదేవా దగ్గర ప్రస్తావిస్తే.. అవును అని నవ్వేశాడు ప్రభు. ఒకప్పుడు డబ్బుల గురించి పట్టించుకునేవాడిని కాదని.. ఇప్పుడు తన తీరు మారిందని అతను చెప్పాడు. ఐతే డబ్బుకు మరీ ఎక్కువ ప్రాధాన్యం మాత్రం ఇవ్వనని.. థియేటరుకు వచ్చే ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడంలోనే తనకు ఎక్కువ ఆనందమని ప్రభుదేవా చెప్పాడు. తన దర్శకత్వంలో కొత్త హిందీ సినిమా డిసెంబర్లో మొదలవుతుందని చెప్పిన ప్రభు.. తెలుగు.. తమిళంలోనూ సినిమాలు చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఖాళీ దొరికితే సినిమాలు చూడటం తప్ప మరో వ్యాపకం ఉండదని... పాప్‌ స్టైల్‌.. బ్రేక్‌ డ్యాన్స్‌ అంటూ ఇలా చాలా చెబుతుంటారని.. ఐతే తనకు తెలిసిందల్లా తన స్టైల్‌ డ్యాన్స్‌ మాత్రమే అని ప్రభుదేవా చెప్పాడు. పాట వినగానే తన మైండ్లో డ్యాన్స్ కంపోజ్ అయిపోతుందని.. తన ఒంట్లోకి కూడా డ్యాన్స్‌ వచ్చేస్తుందని అన్నాడు.