Begin typing your search above and press return to search.

రెప్ప వాల్చనే లేదు - ప్రగ్యా

By:  Tupaki Desk   |   21 Oct 2015 1:30 PM GMT
రెప్ప వాల్చనే లేదు - ప్రగ్యా
X
తెరపై అందాల ముద్దుగుమ్మను చూసి ప్రేక్షకులు రెప్ప వాల్చకపోవడం పరిపాటే.అలాంటిది ఆ అందాల భామే రెప్ప వాల్చని పరిస్థితి వస్తే.. కంచె సినిమా షూటింగ్ సమయంలో సరిగ్గా అదే అనుభవం ఎదురైంది ప్రగ్యా జైశ్వాల్ కి. అయితే ఇది ఆరడుగుల వరుణ్ ని వల్ల కాదండోయ్. మరెందుకన్నది ఆమె మాటల్లోనే
తెలుసుకోండి...

కంచె సినిమాలో నేను రాచకొండ అనే రాజవంశానికి చెందిన యువరాణిగా పాత్రలో కనిపిస్తాను. నా పాత్ర పేరు రాచకొండ సీతాదేవి. కుటుంబ బాంధవ్యాలకు విలువనిస్తూనే.. స్వతంత్ర భావాలు గల పాత్ర.

గబ్బర్ కోసం ఆడిషన్ కి వెళ్లి... కంచె సినిమాకి సెలెక్ట్ అయ్యాను. రాజవంశానికి చెందిన యువతిగా.. నా నడకలో, హావభావాల్లోనూ రాజసం ఉట్టిపడాలని క్రిష్ ముందే చెప్పారు. అందుకోసం మహారాణి గాయత్రిదేవిని స్ఫూర్తిగా తీసుకొన్నాను. కొన్ని పాత సినిమాలనీ చూసాను.

ఈ సినిమాలో ఎవరికైనా థాంక్స్ చెప్పాలంటే అది ఖచ్చితంగా దర్శకుడు క్రిష్ కె. నాలో నటిని నాకు పరిచయం చేసాడు. తెరపై సీతాదేవి ఏం చేసినా అవి ఆయన నేర్పిన పాఠాలే.

వరుణ్ విషయానికొస్తే.. చాలా మంచి నటుడు. ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా యాక్షన్ అంటే చాలు సీన్ పండించేస్తాడు. తనతో నటించడానికి ఎత్తు పెద్ద సమస్య కానే కాదు.ఎందుకంటే నేనూ దాదాపు ఆరడుగులుంటాను(5.8).

నాగబాబు గారు "నువ్వు అచ్చు అలనాటి మేటి నటీమణి కాంచనగారిలా ఉన్నావమ్మా" అని చెప్పడం నాకు లభించిన మొదటి అభినందనగా భావిస్తాను.

కంచె సినిమాలో వర్షంలో వచ్చే ఓ సన్నివేశం వుంటుంది. సినిమాలో ఇది ఎంతో కీలకం. వర్షం పడుతున్నా కంటిరెప్ప వాల్చకూడదు. రెప్ప మూస్తే ప్రేక్షకుడు సన్నివేశంలో లీనమవ్వలేడని క్రిష్ అనేసరికి కంట్లో నీళ్లు పడుతున్నా రెప్ప వేయకుండా నటించా.. సినిమా మొత్తానికి నేను బాగా కష్టపడి నటించిన
సన్నివేశమిదే.

ఇప్పుడు అర్థమయిందా రెప్ప వాల్చనిది ఎందుకో...?