Begin typing your search above and press return to search.

MAA వ‌ర్గ‌పోరు: ఏక‌గ్రీవం అంటున్నా ఆ ఇద్ద‌రూ కాలు దువ్వుతున్నారు!

By:  Tupaki Desk   |   9 July 2021 5:30 AM GMT
MAA వ‌ర్గ‌పోరు: ఏక‌గ్రీవం అంటున్నా ఆ ఇద్ద‌రూ కాలు దువ్వుతున్నారు!
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అధ్య‌క్ష ప‌ద‌వి కోసం నువ్వా.. నేనా? అంటూ ఆరుగురు స‌భ్యులు ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ప్రధాన‌మైన పోటీ ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గంతో మంచు విష్ణు- వీకే న‌రేష్ వ‌ర్గం మ‌ధ్య ఉంటుంది అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికే వీకే న‌రేష్ ప్ర‌కాష్ రాజ్ పై విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సెప్టెంబ‌ర్ లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో చాలా ముందే ప్ర‌కాష్ రాజ్ త‌న ప్యానెల్ స‌భ్యుల‌ను మీడియా ముఖంగా ప‌రిచ‌యం చేయ‌డం అందులో వీకే న‌రేష్ అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్ప‌టి ఈసీ స‌భ్యులు కూడా చేర‌డంతో అస‌లు ర‌చ్చ మొద‌లైంది.

ప్ర‌కాష్ రాజ్ మీడియా స‌మావేశానంత‌రం వీకే న‌రేష్ కూడా మీడియా ముందు స‌మావేశాలు నిర్వ‌హించారు. తాను ప‌ద‌విని విర‌మిస్తున్నాన‌ని ఈసీ కూడా విర‌మించింద‌ని ఈసారి ఒక‌ లేడీ అధ్య‌క్ష‌రాలు కావాల‌ని కూడా ప్ర‌క‌టించారు. అయితే వీకే న‌రేష్ తో సంబంధం లేకుండా ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గం పూరి జ‌గ‌న్నాథ్ కేవ్ (గుహ‌)లో స‌మావేశాలు నిర్వ‌హించ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే పూరి ఆఫీస్ నుంచి ప్ర‌కాష్ రాజ్ త‌న మ‌ద్ధ‌తుదారుల‌ను
కూడ‌గ‌ట్టుకుంటున్న విష‌యం మీడియాలో హైలైట్ అయ్యింది.

అక్క‌డి నుంచి లీకులు రావడంతో ప్ర‌కాష్ రాజ్ ఆ ఆఫీస్ ని వ‌దిలి స్వ‌యంగా ఫిలింన‌గ‌ర్ లో ఓ కొత్త ఆఫీస్ ని ప్రారంభించారు. MAA ఎన్నికల గురించి చర్చలు లీక్ కావడం పట్ల ప్రకాష్ రాజ్ అతని బృందం ఆందోళన చెందుతోంది. తాను త‌న అడ్డాకు సంబంధించిన వ్య‌వ‌హారాలు బ‌య‌ట‌ప‌డిపోవ‌డంతో ఆ లీకులు ఎలా అన్న‌ది అర్థం కాని గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నార‌ట‌. అందుకే ఫిలింన‌గ‌ర్ లో సొంత ఆఫీస్ కి ప్లాన్ చేశారు. త‌న ప్యానెల్ తో ఇక్క‌డే స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ ఆఫీస్ కోసం అద్దెను కూడా భారీగానే చెల్లిస్తున్నార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం అధ్య‌క్ష‌ పదవిని గెలుచుకోవాల‌న్న క‌సితో ప్రకాష్ రాజ్ ఉన్నారు. ఏ ఒక్క అవ‌కాశాన్ని అత‌డు వ‌దులుకునేందుకు సిద్ధంగా లేరు. త‌న వ‌ర్గంతో అత‌డు నిరంత‌రం చ‌ర్చ‌లు సాగిస్తున్నారు.

అయితే ప్ర‌కాష్ రాజ్ ఎత్తుల‌కు పైఎత్తులు వేస్తూ వీకే న‌రేష్ వ‌ర్గం ర‌క‌ర‌కాలుగా పావులు క‌దుపుతోంది. ఈసారి ఒక లేడీకి మ‌ద్ధ‌తివ్వాల‌న్న ప్ర‌తిపాద‌న వీకే న‌రేష్ తెర‌పైకి తేవ‌డానికి కార‌ణం ప్రకాష్ రాజ్ ని నిలువ‌రించ‌డమేన‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ మంచు విష్ణు రేసులో ఉన్నా న‌రేష్ మ‌ద్ధ‌తు అత‌డికి ఉంటుంది. అలాగే సెప్టెంబ‌ర్ లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా వాయిదా ప‌డేలా చేసేందుకు వీకే న‌రేష్ ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేశారు. న‌రేష్ కు సుమారు 100 మంది మా స‌భ్యుల మ‌ద్ధ‌తు ఉంది. ఈ వ‌ర్గంతో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నార‌ని గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయి. ప్ర‌కాష్ రాజ్ వ‌ర్సెస్ వీకే న‌రేష్ పోరు ఎందాకా వెళుతుందోనన్న చ‌ర్చా సాగుతోంది. మ‌రోవైపు వీట‌న్నిటికీ చెక్ పెట్టేందుకు సినీపెద్ద‌లు చిరంజీవి- ముర‌ళిమోహ‌న్ బృందం స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ‌ను అధ్య‌క్షురాలిగా ఏక‌గ్రీవం చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. మునుముంద‌ ఏం జ‌ర‌గ‌నుందో కాల‌మే తేల్చాల్సి ఉంటుంది.

ఆ ఇద్ద‌రితో పాటు జీవిత రాజ‌శేఖ‌ర్.. హేమ‌.. సీవీఎల్ వంటి అభ్య‌ర్థులు అధ్య‌క్ష ప‌ద‌విపై క‌న్నేసి ఎవ‌రికి వారు త‌మ వ‌ర్గాన్ని సిద్ధం చేసుకోవ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇందులో సీవీఎల్ మా ఆఫీస్ ని రెండుగా విభజించాల‌ని ఏపీ-తెలంగాణ అంటూ డివైడ్ పాలిటిక్స్ ని ర‌న్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.