Begin typing your search above and press return to search.

ఎవరూ చేయని పని చేసిన ప్రకాశ్ రాజ్.. ‘మా’ ఇష్యూలోకి కేసీఆర్ ను లాగారా?

By:  Tupaki Desk   |   25 Jun 2021 3:30 PM GMT
ఎవరూ చేయని పని చేసిన ప్రకాశ్ రాజ్.. ‘మా’ ఇష్యూలోకి కేసీఆర్ ను లాగారా?
X
‘మా’ ఎన్నికల ఇష్యూ హాట్ టాపిక్ గానే కాదు.. టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. ఈ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా లోకల్.. నాన్ లోకల్ అన్న మాటలు మొదలయ్యాయి. అధ్యక్ష పదవికి తాను పోటీ చేస్తున్నట్లుగా ప్రకాశ్ రాజ్ వెల్లడించిన వెంటనే వస్తున్న వ్యాఖ్యలపై తాజాగా ప్రకాశ్ రాజ్ స్పందించారు. తనను వేలెత్తి చూపిస్తున్నవారి నోళ్లు మూసేలా ఆయన వినిపించిన వాదన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అన్నింటికి మించి.. లోకల్.. నాన్ లోకల్ ఎపిసోడ్ లోకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీసుకురావటం మరో కీలక పరిణామంగా చెప్పాలి. తనను నాన్ లోకల్ అంటున్న వారికి బలమైన పంచ్ ఇచ్చిన ప్రకాశ్ రాజ్.. ‘హైదరాబాద్ లో ఆంధ్రవారిని కేసీఆర్ నాన్ లోకల్ అని అనలేదు కదా?’ అంటూ తెలివిగా ప్రశ్నించిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఈ వ్యాఖ్యతో తనను నాన్ లోకల్ అనే వారిని ఆత్మరక్షణలో పడేలా ఉందని చెప్పాలి.

ఎందుకంటే.. ఏపీకి చెందిన వారు.. ఏపీ మూలాలు ఉన్న వారిని కేసీఆర్ లాంటి అధినేతే ‘నాన్ లోకల్’ అననప్పుడు సినీ రంగానికి చెందిన వారు ఎలా అంటారన్నది ప్రశ్న. ఒకవేళ.. ప్రకాశ్ రాజ్ మాటలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో మాట తూలితే.. అది ఇష్యూగా మారటమే కాదు.. కొత్త చర్చకు తెర తీస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సీఎం కేసీఆర్ ను ఇబ్బంది పట్టేలా మాట్లాడే దమ్ము సినీ పరిశ్రమలో ఎవరికి లేదు.

అంతేకాదు.. తాను హైదరాబాద్ లో ఉండటంతో పాటు..తెలంగాణ రాష్ట్రంలో తన భాగస్వామ్యం గురించి ప్రకాశ్ రాజ్ ప్రస్తావించిన అంశాల్ని చూసినప్పుడు ఆయన్ను నాన్ లోకల్ అనే మాట అనటం తప్పే అవుతుందన్నట్లుగా ఆయన వాదన ఉంది. ఆధార్ కార్డు ఉంది.. ఇల్లు ఉంది.. పొలం ఉంది.. చివరకు మా పిల్లాడు స్కూలుకు వెళ్లేది ఇక్కడే అన్న ఆయన.. తెలంగాణలోని పల్లెను తాను దత్తత తీసుకున్న విషయాన్ని ప్రస్తావించటం ద్వారా తనను నాన్ లోకల్ అనటం ఎంత తప్పన్న విషయాన్ని చెప్పకనే చెప్పారని చెప్పాలి. కేసీఆర్ ప్రస్తావనను తెలివిగా తీసుకొచ్చిన ప్రకాశ్ రాజ్ కు ఆయన ప్రత్యర్థులు ఏ తీరులో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.