Begin typing your search above and press return to search.

'ది కశ్మీర్ ఫైల్స్' పై ప్రకాశ్ రాజ్ హాట్ కామెంట్స్!

By:  Tupaki Desk   |   18 March 2022 2:30 PM GMT
ది కశ్మీర్ ఫైల్స్ పై ప్రకాశ్ రాజ్ హాట్ కామెంట్స్!
X
దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన సంఘటనలను .. ప్రపంచం విస్తుపోతూ చూసిన సంఘటనలను తెరపైకి ఎక్కించడానికి చాలా గుండె ధైర్యం కావాలి. వాస్తవ సంఘటనలను కళ్ల ముందుంచడానికి సాహసం చేయాలి. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చేసిన ఆ సాహసం పేరే 'ది కశ్మీర్ ఫైల్స్'. తేజ్ నారాయణ్ అగర్వాల్ - అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 11న విడుదలైంది. అనుపమ ఖేర్ .. మిథున్ చక్రవర్తి .. పల్లవి జోషి ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. 1990లలో కశ్మీర్ పండిట్లపై జరిగిన దాడి .. వారి భార్యలపై .. పిల్లలపై జరిగిన అమానుషకాండను కళ్లకు కట్టే సినిమా ఇది.

సాధారణంగా యథార్థ సంఘటనలను తెరకెక్కించే సినిమాలకు మొదటి నుంచే మంచి హైప్ ఉంటుంది .. భారీ బడ్జెట్ .. స్టార్స్ ఉంటే. ఆ రెండూ లేని కారణంగా ఈ సినిమాను గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. చాలా తక్కువ బడ్జెట్ లో .. పరిమితమైన ముఖ్య పాత్రల మద్య ఈ కథ నడుస్తుంది. ఇలాంటి చిన్న సినిమాలకు పెద్ద థియేటర్లు దొరకవు. పోస్టర్స్ చూసినవాళ్లు కూడా ఇలాంటి సినిమాలకి అవార్డులు వస్తాయేమోగానీ .. డబ్బులు వస్తాయా? అని ఎప్పటిలానే అనుకున్నారు. అలాంటివారి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

మొదటి రోజున ఈ సినిమాను 630 థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేశారు. మొదటి రోజు గడిచిన తరువాత ఈ సినిమాను గురించి మాట్లాడుకునేవారి సంఖ్య పెరగడం మొదలైంది. వారం రోజులు తిరిగే సరికే ఈ సినిమా 4 వేల థియేటర్స్ లోకి చేరిపోయింది. వసూళ్లు 100 కోట్లను దాటేశాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమాను గురించిన చర్చనే. ఎమోషన్ అయిన ప్రేక్షకుల అనుభవాలే. ప్రధాని మోదీ సహా ఈ సినిమాను చూసి స్పందించడం .. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సినిమాకి పన్ను మినహాయింపును ఇవ్వడం ఈ సినిమాపై అందరిలో మరింత ఆసక్తిని పెంచాయి.

ఆయా రాజకీయ పార్టీలకు చెందినవారు కూడా ఈ సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఒక వైపున అభినందనలు .. మరో వైపున విమర్శలు మామూలే. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఈ సినిమా గాయాలను మాన్పుతుందా? తిరిగి రేపుతుందా?ద్వేషమనే బీజాలను మళ్లీ నాటుతుందా? అని ప్రశ్నిస్తూ .. జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ కి జత చేశాడు. ఇక సామాన్య ప్రేక్షకుల విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాను చూడలేదని అంటున్నారు. మిగతావారు ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా చూడటానికి కుతూహలాన్ని కనబరుస్తున్నారు.