Begin typing your search above and press return to search.

మౌనవ్రతం చేస్తున్న ప్రకాష్ రాజ్.. ఎందుకంటే..?

By:  Tupaki Desk   |   16 Nov 2021 3:59 AM GMT
మౌనవ్రతం చేస్తున్న ప్రకాష్ రాజ్.. ఎందుకంటే..?
X
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఆగస్ట్ నెలలో ఓ తమిళ సినిమా షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన చేతికి దెబ్బలు తగలడంతో హైదరాబాద్ లో సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులకు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ వచ్చారు. ఈ క్రమంలో తాజాగా ప్రకాష్ రాజ్ తన ఆరోగ్య పరిస్థితి గురించి ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించారు

ఇటీవల కాలంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల బిజీలో ఉన్న ప్రకాష్ రాజ్.. తాజాగా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ తాను పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారని వెల్లడించారు. కాకపోతే ఓ వారం రోజులపాటు మౌనవ్రతం పాటించాల్సి ఉందని పేర్కొన్నారు. ''డాక్టర్స్ వద్ద కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకున్నాను. ఐయామ్ రాకింగ్. అయితే వోకల్ కార్డ్స్ కి మాత్రం ఓ వారంపాటు విశ్రాంతి అవసరం. అందుకే మౌనవ్రతం చేయబోతున్నా. మౌనం ఆనందాన్ని ఇస్తుంది'' అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.

కాగా, ఎలాంటి పాత్ర అయినా పరకాయ ప్రవేశం చేసే ప్రకాష్ రాజ్.. హీరోగా విలన్ గా ‏క్యారక్టర్ ఆర్టిస్టుగా అనేక పాత్రల్లో నటించారు. భాషతో సంబంధం లేకుండా తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం అనేక క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉన్న ప్రకాశ్ రాజ్.. ఇప్పుడు 'జై భీమ్' 'పెద్దన్న' వంటి సినిమాలతో అలరిస్తున్నారు. ఇకపోతే ప్రకాశ్ రాజ్ ఈ మధ్య 'మా' ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేసి ప్రత్యర్థి మంచు విష్ణుపై ఓడిపోయిన సంగతి తెలిసిందే.