Begin typing your search above and press return to search.

మంచు విష్ణుకు తిరుగులేని మాస్టర్ స్ట్రోక్.. ఏం జరగనుంది?

By:  Tupaki Desk   |   13 Oct 2021 3:38 AM GMT
మంచు విష్ణుకు తిరుగులేని మాస్టర్ స్ట్రోక్.. ఏం జరగనుంది?
X
అనూహ్యమైన ఎత్తుగడతో తమ వైరి వర్గాన్ని కోలుకోలేని రీతిలో దెబ్బ తీసే పరిణామాన్ని ‘మాస్టర్ స్ట్రోక్’ గా అభివర్ణిస్తారు. తాజాగా ఆ మాటకు అసలుసిసలు అర్థం చూపేలా వ్యవహరించింది ప్రకాశ్ రాజ్ ప్యానల్. ఇప్పటివరకు జరిగిన ‘మా’ ఎన్నికలకు భిన్నమన్న మాటకు తగ్గట్లే.. మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్ మీట్లో గెలిచిన వారంతా మూకుమ్మడిగా రాజీనామా చేయటం ఒక ఎత్తు అయితే.. విష్ణు.. మై లవ్.. నువ్వు సమర్థుడివి.. మొనగాడివి.. ఏమైనా చేయగలవు.. గెలిచిన మేం రాజీనామా చేస్తున్నాం.. నువ్వు నీ సొంత టీంతో ‘మా’ షోను రన్ చేయ్.. మేం నీకు ఫుల్ సపోర్టు ఇస్తామన్న మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

సాధారణంగా ఎన్నికలు జరిగి.. అందులో ఓటమి పాలైన వారి వర్గం ఆలోచనలు.. స్పందనలు.. ఒక మూస ధోరణిలో ఉంటాయి. అందుకు భిన్నంగా కొత్తగా ఆలోచించటం ఒక ఎత్తు అయితే.. అంత మంది మూకుమ్మడిగా రాజీనామా చేయాలని డిసైడ్ కావటం అంత తేలికైన విషయం కాదు. పదవి పెద్దదా? చిన్నదా? అన్నది పక్కన పెడదాం.. గెలుపు సొంతమయ్యాక దాని నుంచి దూరం కావటానికి చాలామంది ఒప్పుకోరు.

అందుకు భిన్నంగా ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరఫున పోటీ చేసి గెలుపొందిన వారంతా రెండురోజులకే తమ రాజీనామాల్ని చేసేస్తున్నట్లుగా ప్రకటించి.. ‘మా’ అధ్యక్షుడిగా గెలిచిన విష్ణుకు ‘ఫ్రీ హ్యాండ్’ ఇస్తున్నట్లుగా ప్రకటించటం కొత్త తరహా ఎత్తుగడగా చెప్పాలి. సాధారణంగా గెలిచిన టీంలో ఓడిన టీంలో విజయం సాధించిన వారు కొందరు చేరటం ద్వారా.. నిత్యం కొట్టుకోవటం.. తరచూ అధిక్యతల ప్రదర్శన కోసం రచ్చ చేసుకోవటం కన్నా.. డీసెంట్ గా.. మీరు చేసేయండి.. మీకు సపోర్టు చేసేందుకు మేం ఉన్నాం. మాకు పవర్ అక్కర్లేదన్న రీతిలో రాజీనామాల్ని చేసేయటం ఇప్పుడు విష్ణు వర్గానికి ఒక పట్టాన అంతుబట్టటం లేదన్న మాట వినిపిస్తోంది.

ఈ సంచలన ప్రెస్ మీట్ తర్వాత ఏం జరగనుంది? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పటికైతే ప్రకాశ్ రాజ్ వర్గం మౌనంగా ఉంటుందని.. ఇప్పటికి వేసిన ఆరోపణల బండల ప్రకంపనలు పెద్ద ఎత్తున రేగుతున్న వేళ.. ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సింది.. అసలు గొడవలే జరగలేదన్న విషయాన్ని చెప్పాల్సి వస్తే.. అదంతా విష్ణు మీదనే ఉంటుంది. మొత్తానికి ‘మా’ ఎన్నికల వేళలో చోటు చేసుకున్న సినిమాటిక్ సీన్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో తాజా పరిణామాలు ఉన్నాయని చెప్పాలి. ఏమైనా.. ‘మా’ డ్రామా కంటిన్యూ కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.