Begin typing your search above and press return to search.

భర్తకు పాదపూజ చేయడంపై ట్రోలింగ్.. ఘాటుగా స్పందించిన హీరోయిన్..!

By:  Tupaki Desk   |   4 Aug 2022 4:06 AM GMT
భర్తకు పాదపూజ చేయడంపై ట్రోలింగ్.. ఘాటుగా స్పందించిన హీరోయిన్..!
X
'ఏం పిల్లో ఏం పిల్లాడో' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్. 'అత్తారింటికి దారేది' సినిమాతో బాపు బొమ్మగా మారిన ఈ బ్యూటీ.. తెలుగుతో పాటుగా కన్నడ తమిళ చిత్రాల్లో నటించింది. హిందీ పరిశ్రమలోనూ అడుగుపెట్టిన ప్రణీత.. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తోన్న ప్రణీత.. కొన్ని రోజుల క్రితం తన భర్త నితిన్‌ రాజుకు పాద పూజ చేస్తున్న ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీన్ని భీమన అమావాస్య పూజ అని అంటారు. పెళ్ళైన అమ్మాయిలే కాదు.. పెళ్లి కాని అమ్మాయిలు కూడా మంచి భర్త రావాలని ఈ పూజ చేస్తుంటారు. అయితే పాద పూజ చేసిన ప్రణీతను కొందరు నెటిజన్లు నెట్టింట ట్రోల్ చేశారు.

సాంప్రదాయాలను ఫాలో అవుతూ తన భర్త కు పూజ చేస్తే.. ప్రణీత ఇంకా ఏ కాలంలో ఉందటూ వెటకారంగా కామెంట్స్ చేశారు. స్త్రీ, పురుష సమానత్వం లేదని ఫైట్ చేస్తుంటే.. ఈమె మాత్రం భర్తకు పాద పూజ చేస్తూ మా స్థానం ఇదేనని చెప్పకనే చెప్తోందని విమర్శించారు. ఈ ట్రోల్స్ పై ప్రణీత స్పందించింది.

''జీవితంలో జరిగే ప్రతి విషయానికి రెండు కోణాలుంటాయి. 90 శాతం జనాలు పాజిటివ్‌ గా స్పందిస్తారు. మిగిలినవారు తమకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారు. ఇలాంటివి నేను పట్టించుకోను. ఒక నటిగా గ్లామర్‌ ఫీల్డ్‌ లో ఉన్నంతమాత్రాన నేను సాంప్రదాయాలను, ఆచారాలను ఎందుకు పాటించనని అనుకుంటున్నారు? నేను చిన్నప్పటినుంచి అలాంటివి చూస్తూ పెరిగాను'' అని ప్రణీత కాస్త ఘాటుగా రియాక్ట్ అయింది.

''నా సిస్టర్స్ - ఫ్రెండ్స్‌ - ఇరుగుపొరుగు వాళ్ళు అందరూ ఇలా ఈ పూజ చేశారు. పెళ్లి తర్వాత గతేడాది కూడా నేను ఈ పూజ చేశాను. కాకపోతే సోషల్ మీడియాలో ఫొటో షేర్‌ చేయలేదంతే. చెప్పాలంటే ఇది నాకు కొత్తేం కాదు. నేనెప్పుడూ పద్ధతి గల అమ్మాయిగానే నడుచుకోవాలనుకుంటాను.సాంప్రదాయ విలువలను.. పూజలు పునస్కారాలను గౌరవిస్తాను. అమ్మ, పెద్దమ్మలు, నానమ్మలు, బాబాయిల మధ్యే పెరిగాను. ఆ వాతావరణం నాకిష్టం. మోడ్రన్‌ గా ఆలోచించడమంటే మనం నడిచొచ్చిన దారిని మర్చిపోవడం కాదు'' అని ప్రణీత చెప్పుకొచ్చింది

ఇకపోతే ప్రణీత తెలుగులో 'బావ' 'పాండవులు పాండవులు తుమ్మెద' 'డైనమైట్' 'రభస' 'బ్రహ్మోత్సవం' 'అత్తారింటికి దారేది' 'హలో గురూ ప్రేమ కోసమే' సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ - ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది కానీ స్టార్ హీరోయిన్ గా మారలేకపోయింది.

కాకపోతే కన్నడ ఇండస్ట్రీలో మాత్రం ప్రణీతకు మంచి గుర్తింపు లభించింది. తెలుగులో చెప్పుకోదగ్గ పాత్రలు రాకపోడంతో ఇక్కడ ఎక్కువగా సినిమాలు చేయలేకపోయానని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ తెలిపింది. చివరగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన ప్రణీత.. 'భుజ్' - 'హంగామా 2' వంటి చిత్రాల్లో నటించింది. పెళ్లి తర్వాత సినీ రంగానికి దూరమైన ఈ భామ.. త్వరలో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందేమో చూడాలి.