Begin typing your search above and press return to search.

ప్రవీణ్ సత్తారుకు బంపరాఫర్..

By:  Tupaki Desk   |   15 March 2016 5:30 PM GMT
ప్రవీణ్ సత్తారుకు బంపరాఫర్..
X
ఎల్బీడబ్ల్యూ - చందమామ కథలు లాంటి మంచి సినిమాలు తీసినా.. ప్రవీణ్ సత్తారుకు ఆశించినంత పేరు రాలేదు. ఎందుకంటే ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయాయి. ఐతే ఈసారి రూటు మార్చి ‘గుంటూరు టాకీస్’ తీశాడు. ప్రవీణ్ మాటల్లో చెప్పాలంటే అది ‘రా’గా ఉండే మూవీ. కానీ జనాలకు మాత్రం పరమ బూతు సినిమాగా అనిపించింది. ఏదైతే అయ్యింది కానీ.. సినిమాకు వసూళ్లు మాత్రం బాగానే వచ్చాయి. ప్రవీణ్ సినిమాల్లో తొలిసారి పెట్టుబడిని వెనక్కి తెచ్చి.. నిర్మాతకు కొంచెం లాభం కూడా మిగిల్చిన సినిమా అయ్యింది ‘గుంటూరు టాకీస్’. ఐతే బూతు హైలైట్ అయినప్పటికీ.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వ ప్రతిభ కూడా ఇందులో కనిపించింది.

తమిళంలో ఇలాగే కొంచెం అడల్ట్ కామెడీ టచ్ ఉన్న సినిమా చేశాడు హీరో సిద్ధార్థ్. అదే.. జిల్ జంగ్ జక్. ఇక్కడే సిద్ధుకి - ప్రవీణ్ కు లంకె కుదిరింది. ‘గుంటూరు టాకీస్’ పుణ్యమా అని తన పేరు బాగానే ప్రచారంలోకి రావడంతో వెంటనే వెళ్లి సిద్ధుని కలిసి ఓ కథ చెప్పాడట ప్రవీణ్. అతడికి కథ నచ్చి దీని మీద వర్క్ చేసి పూర్తి స్థాయి స్క్రిప్టుతో రమ్మన్నాడట. ఫైనల్ వెర్షన్ కూడా ఓకే అయితే.. సిద్ధునే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయి. కొన్నాళ్లుగా టాలీవుడ్ కు ముఖం చాటేసిన సిద్ధు.. కోలీవుడ్ కే పరిమితం అయిపోయాడు. ఐతే తిరిగి ఇటువైపు రావాలని అతడికీ ఉంది. ప్రవీణ్ సినిమాను ద్విభాషా చిత్రంగా తెరకెక్కిస్తే రెండు చోట్లా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నట్లున్నాడు. మొత్తానికి ప్రవీణ్ ఓ బంపరాఫర్ పట్టేసినట్లే ఉన్నాడు.