Begin typing your search above and press return to search.

రామ్-సత్తారు.. నాలుగు భాషల సంగమం

By:  Tupaki Desk   |   11 April 2018 8:06 AM GMT
రామ్-సత్తారు.. నాలుగు భాషల సంగమం
X
యువ కథానాయకుడు రామ్ ప్రస్తుతం త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ‘హలో గురూ ప్రేమ కోసమే’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తయిందట. ఎప్పుడు ఒక సినిమా తర్వాత ఇంకోటి చేసే రామ్.. ఈసారి ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే మరో సినిమా మొదలుపెట్టబోతున్నాడు. ‘గరుడవేగ’తో తనదైన ముద్ర వేసిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రామ్ నటించబోతున్నాడు. భారీ బడ్జెట్లో తెరకెక్కబోయే ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్లో నాలుగు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు నటిస్తారట.

బాలీవుడ్ నుంచి దర్శన్ కుమార్.. మలయాళం నుంచి సంజు శివరామ్ లను ఎంచుకున్న ప్రవీణ్ సత్తారు.. ఓ ప్రముఖ తమిళ నటుడి కోసం ఇంకో కీలక పాత్రను తీర్చిదిద్దాడట. మిగతా వాళ్లంతా తెలుగు నటీనటులే కనిపిస్తారు. రామ్ మార్కెట్ స్థాయిని మించి భారీ బడ్జెట్లో ఈ చిత్రం తెరకెక్కనున్న నేపథ్యంలో దీన్ని వేరే భాషల్లోనూ రిలీజ్ చేసి ఆదాయం ఆర్జించాలని భావిస్తున్నారు. ముందు ఈ చిత్రానికి ‘భవ్య క్రియేషన్స్’ ఆనంద్ ప్రసాద్ ను నిర్మాతగా అనుకున్నారు. ఐతే బడ్జెట్ ఎక్కువ కావడంతో ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు సమాచారం. రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోరే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తారని అంటున్నారు. మే నెలలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. వచ్చే ఏడాది రిలీజ్ చేయాలన్న ప్రణాళికలో ఉన్నారు.