Begin typing your search above and press return to search.

తెలుగు చ‌ల‌న చిత్ర సీమ‌లో కుదుపు!

By:  Tupaki Desk   |   11 Aug 2018 12:25 PM GMT
తెలుగు చ‌ల‌న చిత్ర సీమ‌లో కుదుపు!
X
చాలాకాలంగా చ‌ల‌న చిత్ర సీమ‌ను పైర‌సీ భూతం ప‌ట్టిపీడిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి నిర్మించిన సినిమాలు...విడుద‌లైన గంట‌ల్లోనే ఆన్ లైన్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డం నిర్మాత‌ల‌ను క‌ల‌వ‌రపెడుతోంది. అయితే, కొంత‌కాలంగా....విడుద‌ల‌కు ముందే జ‌రుగుతోన్న ప్రీ రిలీజ్ పైర‌సీ వ‌ల్ల నిర్మాత‌లు నానా ఇబ్బందులు పడిన ఘ‌ట‌న‌లున్నాయి. అత్తారింటికి దారేది సినిమా విడుద‌ల‌కు ముందే ఫ‌స్ట్ హాఫ్ ఆన్ లైన్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డం సంచ‌ల‌నం రేపింది. అక్కడ నుంచి తాజాగా అర‌వింద స‌మేత వీర రాఘ‌వ స్టిల్స్ లీక్ కావ‌డం వ‌ర‌కు....ఈ లీకులు కొన‌సాగుతూనే ఉండ‌డం శోచ‌నీయం. అయితే, అన్ని సంద‌ర్భాల్లోనూ ఇంటి దొంగ‌లే ఈ పైర‌సీకి సూత్ర‌ధారులు కావ‌డం క‌ల‌వ‌ర‌పెడుతోంది. చిత్ర‌యూనిట్ లోని కొంద‌రు స‌భ్యులు ఈ లీకులకు పాల్ప‌డ‌డంతో నిర్మాత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. తాజాగా, హైద‌రాబాద్ కు చెందిన ఓ ఎడిట‌ర్ కు చెందిన హార్డ్ డిస్క్ నుంచి....విడుద‌ల‌కు రెడీగా ఉన్న, షూటింగ్ జ‌రుపుకుంటోన్న చిత్రాల రా ఫుటేజ్ ల‌భించ‌డం సంచ‌ల‌నం రేపింది.

2013లో అత్తారింటికి దారేది ప్రీ లీక్ త‌ర్వాత‌...నిర్మాత‌లు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. త‌మ సొంత ఆఫీసుల్లోనే చిత్ర ఫుటేజ్ ఎడిటింగ్ జ‌రుపుతున్నారు. అయితే, ఇంటిదొంగ‌ల బెడ‌ద మాత్రం వారిని వ‌ద‌ల‌డం లేదు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తోన్న గీత గోవిందం - టాక్సీవాలా చిత్రాల రా ఫుటేజ్ కూడా లీక‌యింది. అయితే, వాటి స్క్రీన్ షాట్స్ ...చూసిన ఓ దర్శ‌కుడు...చిత్ర యూనిట్ కు స‌మాచారమివ్వ‌డంతో ఈ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. దీంతో, ఆ లీక్ కు కార‌ణ‌మైన ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆ ఫుటేజ్ ...వేరే ఎవ‌రికీ షేర్ చేయ‌లేద‌ని పోలీసులు నిర్ధార‌ణ చేసుకున్నారు. మ‌రోవైపు, హార్డ్ డిస్క్ నుండి డేటాని త‌స్క‌రించి స‌ర్కులేట్ చేస్తున్న హైద్రాబాది ఎడిట‌ర్ రాజేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అత‌డి ద‌గ్గ‌ర నుంచి హ‌ర్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు. ఆ హార్డ్ డిస్క్ ల‌లో కొన్ని షూటింగ్ లో ఉన్న చిత్రాల రా-ఫుటేజ్ ఉండ‌డం విశేషం. అయితే, గుంటూరులోని ఓ ప్ర‌ముఖ కాలేజీలో చ‌దువుతోన్న 17 మంది విద్యార్దుల‌కు ఈ వ్య‌వ‌హారంతో సంబంధం ఉన్న‌ట్లు తేలింది. దీంతో, వారినికూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ల్యాప్‌టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్య‌వ‌హారంలో ఇంకెవ‌రి పాత్ర ఉంద‌న్న కోణంలో ఐ పి అడ్ర‌సుల‌ ఆధారంగా పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. మ‌రో రెండు రోజుల్లో ఈ వ్య‌వ‌హారంలో మ‌రిన్ని అరెస్ట్ లు జర‌గ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. అయితే, ఈ పైర‌సీ వ్య‌వ‌హారంలో కొంత‌మంది విద్యార్థులు ఇన్ వాల్వ్ కావ‌డం బాధాక‌రం.