Begin typing your search above and press return to search.

'ప్రేమ్ కుమార్' గ్లిమ్స్: పీకే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి లేచిపోతే..!

By:  Tupaki Desk   |   1 Sep 2021 6:30 AM GMT
ప్రేమ్ కుమార్ గ్లిమ్స్: పీకే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి లేచిపోతే..!
X
'తను నేను' చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన సంతోష్ శోభన్.. 'పేపర్ బాయ్' సినిమాతో పర్వాలేదనిపించాడు. ఇటీవల 'ఏక్ మినీ కథ' చిత్రంతో సూపర్ హిట్ అందుకుని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు - ఒక వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసి మరో సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. వాటిలో ''ప్రేమ్ కుమార్'' సినిమా ఒకటి.

అభిషేక్ మహర్షి అనే డెబ్యూ డైరెక్టర్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా 'ప్రేమ్ కుమార్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా ఫస్ట్ గ్లిమ్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. పెళ్లి స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌య్యే చింతపిక్కల ప్రేమ్ కుమార్ అనే యువకుడిగా సంతోష్ శోభన్ కనిపిస్తున్నాడు.

పీకే వివాహం చేసుకోబోయే అమ్మాయి పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయునట్లు ఈ వీడియోలో చూపించారు. 'ఏక్ మినీ కథ' చిత్రంలో తన ప్రైవేట్ పార్ట్ చిన్నదని ఆత్మ‌నూన్య‌తా భావంలో ఉండే యువకుడిగా సంతోష్ నటించగా.. 'ప్రేమ్ కుమార్' లో పెళ్లి అవ్వడం లేదనే ఫ్రస్ట్రేషన్‌ లో ఉండే కుర్రాడిగా నటించినట్లు తెలుస్తోంది. సరదాగా ఉన్న ఫస్ట్ గ్లిమ్స్ అందరినీ నవ్విస్తోంది.

'ప్రేమ్ కుమార్' చిత్రంలో సంతోష్ శోభన్ సరసన రాశీ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై.లి. పతాకంపై శివప్రసాద్ పన్నీరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిషేక్ మహర్షి - అనిరుధ్ కృష్ణమూర్తి కలిసి ఈ రాసారు. అనంత్ శ్రీకర్ సంగీతం సమకూర్చగా.. కిట్టు విస్సాప్రగడ పాటలు రాస్తున్నారు. రాంపీ నందిగాం సినిమాటోగ్రఫీ.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

'పేపర్ బాయ్' తర్వాత మూడేళ్ళ గ్యాప్ తీసుకున్న సంతోష్ శోభన్.. యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకునే కథలను ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడనేది అర్థం అవుతోంది. అందులో కూడా వెరీయేషన్స్ ఉండేలా చూసుకుంటున్నాడు. మారుతి దర్శకత్వంలో నటిస్తున్న 'మంచి రోజులు వచ్చాయి' చిత్రం లాక్ డౌన్ లో జరిగిన సంఘటనతో రూపొందిన కామెడీ ఎంటర్టైనర్.

నందినీ రెడ్డి తో చేస్తున్న 'అన్నీ మంచి శకునములే' చిత్రం లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. 'ప్రేమ్ కుమార్' కూడా కొత్త త‌ర‌హా కాన్సెప్టుతో వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్. ఇలా సంతోష్ శోభన్ యూత్ ఆకట్టుకునే విభిన్నమైన కథలని సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడని అర్థం అవుతోంది. మరి ఇవన్నీ అతన్ని హీరోగా నిలబెడతాయేమో చూడాలి.