Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ‘ప్రేమమ్’

By:  Tupaki Desk   |   7 Oct 2016 9:06 AM GMT
మూవీ రివ్యూ : ‘ప్రేమమ్’
X
చిత్రం: ‘ప్రేమమ్’

నటీనటులు: అక్కినేని నాగచైతన్య - శ్రుతి హాసన్ - మడోన్నా సెబాస్టియన్ - అనుపమ పరమేశ్వరరన్ - కృష్ణచైతన్య - ప్రవీణ్ - పృథ్వీ - అరవింద్ కృష్ణ - నర్రా శీను - బ్రహ్మాజీ - శ్రీనివాసరెడ్డి తదితరులు
సంగీతం: గోపీసుందర్ - రాజేష్ మురుగేశన్
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
కథ: అల్ఫాన్సో పుతెరిన్
స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: చందూ మొండేటి

ప్రేమమ్.. గత ఏడాది కోట్లాది హృదయాల్ని పులకించిపోయేలా చేసిన మలయాళ ప్రేమకావ్యం. కేవలం మలయాళీలనే కాదు.. కొంతవరకు వేరే భాషల వాళ్లనూ మైకంలో పడేసిందీ సినిమా. ఇదే మైకాన్ని ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకూ కలిగించాలన్న ప్రయత్నంలో ‘ప్రేమమ్’ పేరుతోనే తెలుగులోనూ ఈ సినిమాను తెరకెక్కించారు. ‘కార్తికేయ’ లాంటి సెన్సేషనల్ థ్రిల్లర్ తీసిన చందూ మొండేటి దర్శకత్వం వహించడం.. ప్రేమకథలకు బాగా నప్పే అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటించడంతో తెలుగు ‘ప్రేమమ్’ మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాల్ని ‘ప్రేమమ్’ అందుకుందా.. తెలుగులోనూ మ్యాజిక్ రిపీటైందా.. చూద్దాం పదండి.

కథ:

విక్రమ్ అలియాస్ విక్కీ (నాగచైతన్య) అనే కుర్రాడి జీవితంలోకి వేర్వేరు దశల్లో ముగ్గురు అమ్మాయిలు ప్రవేశిస్తారు. ముందు టీనేజీలో ఉండగా సుమ (అనుపమ పరమేశ్వరన్)తో.. ఆ తర్వాత కళాశాల స్థాయిలో ఉండగా సితార (శ్రుతి హాసన్)లో.. ఆపై జీవితంలో స్థిరపడ్డాక సింధు (మడోన్నా సెబాస్టియన్)తో ప్రేమలో పడతాడు విక్కీ. మరి ఆ ముగ్గురమ్మాయిలు అతడి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించారు.. చివరికి విక్కీ జీవితం ఎవరితో ముడిపడింది అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

పాఠశాలలో చదువుతుండగా.. అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన దశలో పుట్టే ఆకర్షణతో కూడిన ప్రేమ.. ఆ తర్వాత కళాశాల స్థాయిలో ఇంకా జీవితం పట్ల ఓ అవగాహన రాని తరుణంలో పుట్టే ప్రేమ.. ఆపై జీవితంలో స్థిరపడ్డ దశలో పూర్తి పరిణతితో ఉండగా కలిగే ప్రేమ.. ఇలా ఓ వ్యక్తి జీవితంలో మూడు ప్రేమ దశలను హృద్యంగా తెరపై ఆవిష్కరించిన సినిమా ‘ప్రేమమ్’. జీవితంలో ఏ వ్యక్తి అయినా ఏదో ఒక దశలో ప్రేమ భావనకు లోనవుతాడు. ఆ భావనను అనుభూతి చెందిన వాళ్లందరికీ ‘ప్రేమమ్’ కూడా మంచి అనుభూతినే మిగులుస్తుంది.

ఒక సినిమా చూస్తున్నట్లు కాకుండా ఒక వ్యక్తి జీవితాన్ని పక్కనుండి గమనిస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది ‘ప్రేమమ్’. డ్రామాకు అవకాశం లేకుండా అత్యంత సహజంగా సగటు కుర్రాడి జీవితాన్ని.. అతడి ప్రణయ గాథల్ని తెరపై ఆవిష్కరించడంలో ‘ప్రేమమ్’ బృందం విజయవంతమైంది. ఈ కథలోని ఒరిజినాలిటీ.. సహజత్వం.. మెజారిటీ ప్రేక్షకులు తమను తాము రిలేట్ చేసుకునేలా సాగే సన్నివేశాలు.. ‘ప్రేమమ్’కు అతి పెద్ద బలం. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కనిపించే హడావుడి.. మెలోడ్రామా.. ఫార్ములాటిక్ సన్నివేశాలు ఇందులో కనిపించవు. అంతా సింపుల్ గా.. సహజంగా.. సటిల్ గా సాగిపోతుంది. అందుకే దీన్ని ఓ సినిమాలా కాకుండా ఓ లైఫ్ జర్నీని చూస్తున్నట్లుగా చూస్తే మరింత మంచి అనుభూతిని కలిగిస్తుంది.

‘ప్రేమమ్’ లాంటి క్లాసిక్స్ ను రీమేక్ చేయాలనుకోవడం గొప్ప సాహసమే. ఎందుకంటే ఇది ప్రధానంగా ఫీల్ తో నడిచే సినిమా. మలయాళ దర్శకుడు అల్ఫాన్సో పుతెరిన్ కవితాత్మకంగా.. హృదయ లోతుల్ని తట్టేలా ‘ప్రేమమ్’ను ఆవిష్కరించాడు. అలాంటి సినిమాను రీమేక్ చేసినపుడు అదే ఫీల్ తీసుకురావడం అంత సులువైన విషయం కాదు. ఒక పొయెటిక్ ఎక్స్ ప్రెషన్ ను మళ్లీ అదే అనుభూతితో ప్రెజెంట్ చేయడం అన్నది సాధ్యం కాదు. ఉదాహరణకు మలయాళ ‘ప్రేమమ్’లో బోలెడన్ని సింబాలిక్ షాట్స్.. ప్రకృతి దృశ్యాలు.. అక్కడి నేటివిటీతో.. కల్చర్ తో ముడిపడ్డ సీన్స్ చాలా కనిపిస్తాయి. వాటన్నింటినీ తెలుగులోకి తెస్తే అతక్కపోవచ్చు. అదే సమయంలో మార్పులు చేసుకుంటూ వెళ్తే మాతృకను చెడగొట్టినట్లవుతంది.

యువ దర్శకుడు చందూ మొండేటి ఈ విషయంలో బ్యాలెన్స్ పాటించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మలయాళంలో లాగా పాస్ ఇచ్చి పాస్ ఇచ్చి సన్నివేశాలు నడిపించలేదతను. నరేషన్ విషయంలో కూడా అల్ఫాన్సో శైలిని కాపీ కొట్టే ప్రయత్నం చేయలేదు. మలయాళంతో పోలిస్తే తెలుగులో కథనంలో వేగం కనిపిస్తుంది. ఎడిటింగ్ షార్ప్ గా ఉంటుంది. సినిమా క్రిస్ప్ గా అనిపిస్తుంది. సన్నివేశాలు చకచకా సాగిపోతాయి. లాగ్ ఉండదు. ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచారు. ఈ క్రమంలో ఒరిజినల్ తో పోలిస్తే తెలుగు ‘ప్రేమమ్’లో ఫీల్.. ఎమోషన్ కొంచెం తగ్గిన మాట వాస్తవం. అదే సమయంలో ఈ ‘ప్రేమమ్’ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు.. రీచ్ మరింత పెరిగేలా రూపొందింది.

మలయాళ వెర్షన్ తో బాగా కనెక్టయిన వాళ్లకు తెలుగు ‘ప్రేమమ్’ అంత భావయుక్తంగా అనిపించకపోవచ్చు. ఐతే రీమేక్ అన్నాక ప్రతి విషయాన్నీ పోల్చి చూడటం.. కొన్ని విషయాల్లో నిరాశ చెందడమూ సహజం. ఒరిజనల్ తో పోల్చకుండా చూసే మెజారిటీ ప్రేక్షకులకు.. ఓపెన్ మైండ్ తో చూసేవాళ్లకు ‘ప్రేమమ్’ కచ్చితంగా నచ్చుతుంది. మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఫీల్.. ఎమోషన్ పాళ్లు తగ్గినప్పటికీ ‘ప్రేమమ్’ను ఉన్నంతలో చాలా మెరుగ్గానే రీమేక్ చేసింది చందూ మొండేటి అండ్ కో. అనుపమతో సాగే టీనేజ్ లవ్ స్టోరీ నిడివిని కొంచెం తగ్గించిన చందూ.. చివర్లో మడోన్నాతో వచ్చే ప్రేమకథ లెంగ్త్ పెంచాడు. ఇందులో డెప్త్ కూడా పెరిగింది. కొంచెం కథ నడిపించాడు. ఇక ఎంటర్టైన్మెంట్ పార్ట్ కూడా ఒరిజినల్ తో పోలిస్తే పెరిగింది. నర్రా శ్రీను.. శ్రీనివాసరెడ్డి పాత్రలతో చక్కటి వినోదం పంచాడు చందూ. వెంకటేష్.. నాగార్జునల క్యామియోలను వాడుకున్న తీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వెంకీ కనిపించే నాలుగైదు నిమిషాలు అదిరిపోయింది.

పోలికలు.. మార్పులు చేర్పుల సంగతి పక్కనబెడితే తొలి 20 నిమిషాల్లో సాగే టీనేజ్ లవ్ స్టోరీ షార్ట్ అండ్ స్వీట్ అనిపిస్తుంది. అనుపమ ‘అఆ’తో పోలిస్తే ఇందులో చాలా బాగుంది. ఆమె డబ్బింగ్ కూడా బాగా కుదిరింది. తన వెంట హీరో తిరుగుతున్నాడని తెలిసినా.. ఆమె అదేమీ పట్టనట్లు అతణ్ని తన ప్రేమకు ఉపయోగించుకోవడం కొంచె ఇల్లాజికల్ గా అనిపించడం ఒక్కటే ఈ ప్రేమకథలో చిన్న మైనస్. ఆ తర్వాత కాలేజీ నేపథ్యంలో సాగే శ్రుతి హాసన్ ఎపిసోడ్ సినిమాకు మేజర్ హైలైట్. దాదాపు గంట పాటు సాగే ఈ ఎపిసోడ్ ఎలా గడిచిందో తెలియకుండా సాగిపోతుంది. అమ్మాయి లెక్చరర్.. అబ్బాయి స్టూడెంట్.. వీళ్లిద్దరి మధ్య ప్రేమకథ అన్న పాయింటే తాజాగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా అంత తాజాగా సాగుతాయి. ఎంటర్టైన్మెంట్.. ఫీల్ రెండూ ఉన్న ఈ ప్రేమకథను ముగించిన తీరు.. హృదయాల్ని తడుతుంది. ఆ తర్వాత చివరి లవ్ స్టోరీ హీరో పాత్రలో వచ్చిన మెచ్యూరిటీకి తగ్గట్లే పరిణతితో సాగుతుంది. సినిమాను ముగించిన తీరు మరింత మంచి ఫీలింగ్ తో ప్రేక్షకుడు బయటికి వచ్చేలా చేస్తుంది. దర్శకుడి పనితనం.. నటీనటుల అభినయం.. సాంకేతిక నిపుణుల ప్రతిభ.. అన్నీ కూడా సరిగ్గా కలవడంతో ‘ప్రేమమ్’లో చెప్పుకోదగ్గ విశేషం.

నటీనటులు:

ఒక పాత్రను ఒక నటుడు ఓన్ చేసుకుంటే.. ఆ పాత్రతో ప్రేమలో పడితే ఎలా ఉంటుందో ‘ప్రేమమ్’లో చూడొచ్చు. విక్కీ పాత్రలో అంత బాగా ఒదిగిపోయాడు చైతూ. చాలా సహజంగా.. ఒక వ్యక్తి తన జీవితంలో వేర్వేరు దశల్లో ఎలా ఉంటాడో అలా కనిపించాడు చైతూ. ఈ పాత్ర.. ఈ పెర్ఫామెన్స్ చైతూ కెరర్లో ది బెస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. టీనేజీలో ప్రేమ మైకంలో ఉంటూ తుళ్లిపడే కుర్రాడిగా చైతూను చూసినపుడే ఇంప్రెస్ అయిపోతాం. ఆ వయసుకు తగ్గట్లుగా అతను ఇమ్మెచ్యూర్డ్ గా కనిపించిన తీరు ఆకట్టుకుంటుంది. తర్వాత రెండో ఎపిసోడ్లోకి వచ్చేసరికి పూర్తి భిన్నంగా కనిపించి మెప్పిస్తాడు. ఇక చివరి ఎపిసోడ్ లోనూ అంతే ఆకట్టుకుంటాడు. ఒక వ్యక్తి వయసు పెరిగే కొద్దీ ఎలాంటి పరిణతి వస్తుందన్నది చైతూ పాత్రల్లో స్పష్టంగా కనిపిస్తుంది. లుక్ నుంచి ప్రవర్తన వరకు అన్నింట్లోనూ మార్పు కనిపిస్తుంది. మూడు వేర్వేరు దశలకు తగ్గట్లుగా వేరియేషన్ చాలా బాగా చూపించాడు చైతూ. ఇక్కడ దర్శకుడు తీసుకున్న కేర్ కూడా అభినందనీయం. తను ప్రేమించిన అమ్మాయికి ఏమీ గుర్తులేదని తెలిసినపుడు తన్నుకొచ్చే భావోద్వేగాల్ని బయటపెట్టినపుడు.. చివరి ఎపిసోడ్ లో ఫోన్లో ఫ్రెండు తన పాత లవర్ ప్రస్తావన తెచ్చినపుడు ఇచ్చిన హావభావాలు చైతూ నటనలోని మెచ్యూరిటీని తెలియజేస్తాయి.

హీరోయిన్లు ముగ్గురూ కూడా పాత్రలకు తగ్గట్లు చక్కగా కుదిరారు. అందం.. అభినయం రెండింట్లోనూ కథానాయికలు మెప్పించారు. అనుపమ పాత్ర చిన్నది. మిగతా ఇద్దరూ ఎక్కువ స్క్రీన్ టైం తీసుకున్నారు. సాయిపల్లవితో పోల్చకుండా చూస్తే శ్రుతి కూడా చాలా బాగా అనిపిస్తుంది. మడోన్నా గ్లామర్ పరంగా మామూలుగా అనిపిస్తుంది కానీ.. తన నటనతో హావభావాలతో ఆమె కట్టిపడేస్తుంది. ఆమె నవ్వుకు పడిపోతాం. నర్రా శీను.. బ్రహ్మాజీ.. ప్రవీణ్.. శ్రీనివాసరెడ్డి వినోదాన్ని పంచే బాధ్యత తీసుకుున్నారు. వీళ్లతో పాటు కృష్ణచైతన్య.. పృథ్వీ కూడా ఆకట్టుకున్నారు. వెంకీ.. నాగ్ ల క్యామియోలు సినిమాకు ఆకర్షణగా నిలిచాయి.

సాంకేతికవర్గం:

సంగీతం.. ఛాయాగ్రహణం రెండూ కూడా ‘ప్రేమమ్’కు చక్కగా కుదిరాయి. ఒరిజినల్ కు పని చేసిన రాజేష్ మురుగేశన్ తెలుగుకు పని చేయడం వల్ల కొన్ని పాటలతో పాటు నేపథ్య సంగీతాన్ని కూడా వాడుకున్నారు. గోపీసుందర్ ఫ్రెష్ ట్యూన్స్ జోడించాడు. సంగీతం సినిమాలో ఇమిడిపోయింది. పాటలన్నీ కూడా సందర్భోచితంగా ఆహ్లాదంగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరింది. ఇక కార్తీక్ కెమెరా పనితనం కూడా సినిమాను మరింత ఆహ్లాదకరంగా మార్చడంలో కీలక పాత్ర పోషించింది. ఆరంభం నుంచి చివరి దాకా స్క్రీన్ చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. విజువల్స్ అంత బాగున్నాయి. ఎడిటింగ్ కూడా నీట్ గా చేశారు. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ కనిపించలేదు. మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారు.

ఇక ‘కార్తకేయ’ ఫేమ్ చందూ మొండేటి రీమేక్ తోనూ తన ప్రతిభను చాటుకున్నాడు. రీమేక్ అనగానే జిరాక్స్ కాపీ అన్నట్లు తీసేయకుండా అతను చూపించిన సిన్సియారిటీని మెచ్చుకోవాలి. మాతృకలోని సోల్ మిస్ కాకుండానే తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ‘ప్రేమమ్’ను తీర్చిదిద్దాడతను. ‘‘ప్రేమలో గెలవడాలు.. ఓడడాలు ఉండవు. ప్రేమించడం తప్ప’’.. ‘‘నేను ప్రేమిస్తున్నది నా ఫీలింగ్స్ ను. అవి నాతోనే ఉంటాయి. కాబట్టి నేను ప్రేమించిన వ్యక్తి దూరంగా వెళ్లినా ఇబ్బంది ఉండదు’’ లాంటి హృద్యమైన మాటలతో తన పెన్ పవర్ చూపించాడు చందూ. రీమేక్ అయినప్పటికీ ఇందులో దర్శకుడి ముద్ర కనిపిస్తుందంటే అది చందూ మొండేటి ప్రతిభే.

చివరగా: ప్రేమమ్.. ఇది సినిమా కాదు.. ఒక అనుభూతి

రేటింగ్- 3.25/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre