Begin typing your search above and press return to search.

ఈ 'రామ'చరణం ఏందయ్యో!!

By:  Tupaki Desk   |   17 May 2017 10:01 AM GMT
ఈ రామచరణం ఏందయ్యో!!
X
బాహుబలి సినిమా నిర్మాతల్లో ధైర్యం పెంచింది. భారీ బడ్జెట్ తో సినిమాలు తీసి భారీ లాభాలూ కళ్లజూడొచ్చని ఈ సినిమా ప్రూవ్ చేసింది. దీంతో బాహుబలి కన్నా ఎక్కవ బడ్జెట్ తో సినిమాలు తీసేందుకు సిద్ధమైపోతున్నారు. తాజాగా అల్లు అరవింద్ రూ. 500 కోట్లతో రామాయణం తీస్తామని ప్రకటించేశారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా తీయబోతున్నారు. ఏ ముహూర్తాన ఈ సినిమా అనౌన్స్ చేశారోగానీ అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ తెగ ఎగ్జయిట్ అయిపోతున్నారు. సినిమాలు లీడ్ రోల్స్ ఎవరు, దర్శకుడిగా ఎవరిని డిసైడ్ చేసుకున్నారు అనేది అల్లు అరవింద్ ప్రకటించకపోయినా ఫ్యాన్స్ ఈ విషయంలో ఒకడుగు ముందుకేసేస్తున్నారు.

రాముడి క్యారెక్టర్ గా రామ్ చరణ్ తేజ్ తప్ప ఇంకెవరూ సూటవరని ఫ్యాన్స్ అరవింద్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓ అభిమాని అయితే రాముడిగా రామ్ చరణ్ ఎలా ఉంటాడన్న దానిపై రూపొందించిన పోస్టర్ సోషల్ మీడియా బాగానే హల్ చల్ చేస్తోంది. ఇది చూసిన తర్వాత ముఖ్యంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ కు మరింత ఊపొచ్చింది. దీంతో రూ. 500 కోట్లతో తీసే రామాయణంలో రాముడిగా ఇంకెవరినైనా సెలక్ట్ చేసుకుంటే ఫ్యాన్స్ నుంచి గట్టి నిరసనే ఎదురయ్యేలా ఉంది. రామ్ చరణ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది మగధీర మాత్రమే. ఆ తర్వాత సినిమాలు కొన్ని హిట్టయినా అవేవీ మగధీర స్థాయిని చేరుకోలేదు. ఈ విషయంలో చరణ్ ఫ్యాన్స్ లో కాస్త అసంతృప్తి ఉంది. లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ కావడంతో ఈ సినిమా చరణ్ తీస్తే బాహుబలికి దీటుగా నిలిచిపోతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

రామాయణం మూడు భాషల్లో ఒకేసారి తీస్తున్నందున లీడ్ క్యారెక్టర్ల విషయంలో అరవింద్ చాలానే లెక్కలు వేస్తున్నారని సమాచారం. బాలీవుడ్ హీరోతో సినిమా తీస్తే మార్కెట్ బాగా అవుతుందని అనుకుంటున్నారు. అందుకు హృతిక్ రోషన్ అయితే సరిపోతాడని భావిస్తున్నారు. ఇంతవరకు దీనిపై అల్లు అరవింద్ కానీ, రామ్ చరణ్ కానీ నోరు మెదపలేదు. అభిమానుల ఆశలను అల్లు వారు ఎంతవరకు నిలబెడతారో చూడాలి.