Begin typing your search above and press return to search.

తనను తాను హౌస్ అరెస్ట్ చేసుకున్న కమెడియన్

By:  Tupaki Desk   |   18 March 2020 12:15 PM IST
తనను తాను హౌస్ అరెస్ట్ చేసుకున్న కమెడియన్
X
'పెళ్లి చూపులు' చిత్రం తో తెలుగు తెరకు పరిచయమైన వర్ధమాన హాస్యనటుడు ప్రియదర్శి. మొదటి సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న కమెడియన్లలో ఒకరు. తన కామెడీ టైమింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్, పూజాహెగ్డేలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా 'జిల్' రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను జార్జియా షెడ్యూల్ లో ముగించుకొని చిత్ర బృందం ఈ మధ్యే ఇండియాకి తిరిగి వచ్చింది.

మార్చి 31 వరకు యూరప్ మరియు ఇతర దేశాల నుండి విమానాలను అనుమతించబోమని భారత ప్రభుత్వం ప్రకటించడం తో చిత్ర యూనిట్ జార్జియా షెడ్యూల్ ను తగ్గించుకొని తిరుగు ప్రయాణం అయ్యారు.

జార్జియా షూటింగ్ నుండి హైదరాబాద్ తిరిగి వచ్చిన ప్రియదర్శి స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రియదర్శి స్వయంగా తన ట్విట్టర్ ఖాతా వేదికగా తెలియజేసాడు. ఈ రోజు హైదరాబాద్‌లో దిగిన వెంటనే తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకునేందుకు 14 రోజులపాటు అందరికి దూరంగా ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నానని, కరోనా వైరస్ ఎవరికీ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఇది ఒక ప్రయత్నమని పేర్కొన్నాడు. భయపడకండి, ఇతరుల శ్రేయస్సు పట్ల జాగ్రత్త వహించండని, కరోనా వ్యాప్తిని తగ్గించడానికి సోషల్ డిస్టాన్సింగ్ అవసరమని ట్వీట్ చేసాడు. కరోనా వ్యాప్తిని దూరం చేసే చర్యలో భాగంగా సామాజిక దూరం పాటిస్తున్న ప్రియదర్శిని పలువురు అభినందిస్తున్నారు.