Begin typing your search above and press return to search.

విలన్ అనుకుంటే కమెడియన్ అయ్యాడట

By:  Tupaki Desk   |   10 Jun 2018 4:32 AM GMT
విలన్ అనుకుంటే కమెడియన్ అయ్యాడట
X
కొందరు కమెడియన్లను చూడగానే నవ్వొచ్చేస్తుంది. ఈ తరం కమెడియన్లలో ప్రియదర్శి అలాంటి కోవకే చెందుతాడు. ‘పెళ్ళి చూపులు’ సినిమాలో నా సావు నేన్జస్తా నీకెందుకు అంటూ అతను సీరియస్ గా చెప్పిన డైలాగ్ ఎంత నవ్వించిందో తెలిసిందే. ఆ డైలాగే ఒక ట్రెండ్ సెట్టర్ అయిపోయింది. ‘పెళ్ళిచూపులు’ సినిమా తర్వాత ప్రియదర్శి ఎంత బిజీ అయ్యాడో.. ఎలా కామెడీతో దూసుకెళ్తున్నాడో తెలిసిందే. అతను ప్రతి సినిమాలోనూ కామెడీ రోల్సే చేస్తున్నాడు. కానీ నిజానికి ప్రియదర్శి కమెడియన్ అవ్వాలనే అనుకోలేదట. తనకు విలన్ పాత్రలే సరిపోతాయని అనుకున్నాడట. కామెడీకి తాను సూటవ్వనని అనుకున్నాడట. తాను ముందు చేసిన షార్ట్ ఫిలిమ్స్‌ లో కూడా సీరియస్ క్యారెక్టర్లే చేశాడట.

కానీ అనుకోకుండా తాను కమెడియన్ అవతారం ఎత్తానని అతనంటున్నాడు. ‘పెళ్ళిచూపులు’ కంటే ముందు కూడా తాను కొన్ని సినిమాలు చేశానని.. ఆ సినిమాలు పెద్దగా పేరు లేనివని.. కొన్ని విడుదలే కాలేదని.. వాటిలో నెగెటివ్ రోల్స్ చేశానని ప్రియదర్శి తెలిపాడు. సినిమాల్లో బిజీ అయినా విలన్‌ గానే స్థిరపడతానని అనుకున్నాడట. ఐతే దర్శన్ అనే తన ఫ్రెండు తీసిన షార్ట్ ఫిలింలో తొలిసారి కామెడీ రోల్ చేశానని.. అప్పుడు తాను కామెడీ చేయగలనన్న ధీమా వచ్చిందని.. తర్వాత తన ఫ్రెండే అయిన తరుణ్ భాస్కర్ ‘పెళ్ళిచూపులు’లో కౌశిక్ పాత్రతో కామెడీ పండించి తన కెరీర్ ను మలుపు తిప్పాడని ప్రియదర్శి చెప్పాడు. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘వైఫ్ ఆఫ్ రామ్’లో తాను సీరియస్ పాత్రే చేశానని.. ఇందులో ఎక్కడా కామెడీ ఉండదని.. కానీ తన పాత్ర చాలా బాగుంటుందని ప్రియదర్శి అన్నాడు.