Begin typing your search above and press return to search.

అప్పటి నా కోరిక 'నారప్ప'తో నెరవేరింది: ప్రియమణి

By:  Tupaki Desk   |   31 July 2021 3:31 AM GMT
అప్పటి నా కోరిక నారప్పతో నెరవేరింది: ప్రియమణి
X
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన 'నారప్ప'కు విశేషమైన ఆదరణ లభిస్తోంది. దాంతో ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సినిమాలో వెంకటేశ్ భార్య పాత్రను పోషించిన ప్రియమణి ఈ సక్సెస్ మీట్ లో మాట్లాడారు. "చాలాకాలం క్రితం .. నా కెరియర్ తొలినాళ్లలో 'పెళ్లైన కొత్తలో' సినిమాను చేశాను. ఆ సినిమా షూటింగు రామానాయుడు స్టూడియోలో జరుగుతుండేది. అప్పుడు అక్కడ చాలామంది హీరోయిన్ల ఫొటోలు ఉండటం నేను చూశాను. ''ఎందుకని హీరోయిన్లందరి ఫొటోలు ఇక్కడ పెట్టారు?'' అని ఒకసారి నేను అడిగాను. సురేశ్ ప్రొడక్షన్స్ లో నటించిన హీరోయిన్ల ఫొటోలు అలా పెడతారని చెప్పారు.

నేను కచ్చితంగా సురేశ్ ప్రొడక్షన్స్ లో చేయాలి .. నా ఫొటో కూడా అక్కడ ఉండాలి .. నేను అక్కడ నా ఫొటోను చూసుకోవాలి అని అప్పుడే అనుకున్నాను. ఇన్నాళ్లకి ఇప్పుడు 'నారప్ప' చేయగలిగాను. ఇప్పుడు అక్కడ నా ఫొటో ఉంటుందో లేదో తెలియదుగానీ, సురేశ్ ప్రొడక్షన్స్ లో చేయాలనే నా ఆశ మాత్రం నెరవేరింది. నాకు ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు సురేశ్ బాబుగారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక సినిమా విషయంలో సురేశ్ బాబుగారు ఎంత కేర్ తీసుకుంటారనేది నేను ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయాను.

శ్రీకాంత్ అడ్డాల గారి సినిమాలు నేను ఇంతకుముందు చూశాను. మొదటిసారిగా ఈ సినిమాలో ఆయన దర్శకత్వంలో నటించాను. లుక్ టెస్ట్ చేసిన తరువాత 'ఈ పాత్ర మీరే చేస్తారు' అని ఆయన చెప్పగానే నాకు చాలా సంతోషం కలిగింది.
ఆయన దర్శకత్వంలో మళ్లీ చేయాలనుంది. ఇక ఈ సినిమాలో నా పిల్లలుగా కార్తీక్ .. రాఖి చాలా బాగా చేశారు. వాళ్లకి మంచి ఫ్యూచర్ ఉంది .. ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో రెండు మూడుసార్లు వెంకటేశ్ గారితో చేసే అవకాశం వచ్చింది కానీ, కొన్ని కారణాల వలన కుదరలేదు.

ఆయనతో కలిసి నటించాలనే కోరిక ఇప్పుడు 'నారప్ప' సినిమాతో నెరవేరింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వెంకీ సార్ తో కలిసి నేను చేసిన ఈ సినిమాకి ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. తమిళంలో నేను 'అసురన్' చుశాను. అప్పుడు కలిగిన ఫీల్ వేరు .. 'నారప్ప' చూస్తున్నప్పుడు కలిగిన ఫీల్ వేరు. ఈ సినిమా చూసిన వాళ్లంతా కాల్ చేసి మరీ చెబుతున్నారు. మళ్లీ మళ్లీ చూస్తున్నామని అంటున్నారు. ఈ సినిమా అంతగా వాళ్లకి నచ్చడం ... అంతగా నచ్చిన సినిమాలో నేను ఉండటం నాకు సంతోషాన్ని కలిగించే విషయం" అని చెప్పుకొచ్చారు.