Begin typing your search above and press return to search.

అనంత యాస కోసం ప్రియమణికి అంతలా కష్టపడిందట

By:  Tupaki Desk   |   16 July 2021 5:50 AM GMT
అనంత యాస కోసం ప్రియమణికి అంతలా కష్టపడిందట
X
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ఉన్న హీరో మూవీ ఒకటి సినిమా థియేటర్లో కాకుండా ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద విడుదల కావటం జీర్ణించుకోలేని అంశమే. అయితే.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో మరింత ఆలస్యం చేసే కన్నా.. ఓటీటీలో రిలీజ్ చేయటమే మంచిదన్న భావనకు నిర్మాతలు వచ్చేసినట్లుగా చెప్పాలి. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అంశాల్ని తాజాగా ఈ సినిమాలో వెంకటేశ్ తో జోడి కట్టిన ప్రియమణి వెల్లడించారు.

తమిళంలో అసురన్ గా విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని నారప్పగా నిర్మించారు. తమిళ్ లో మంజు వారియర్ చేసిన పాత్రను తెలుగులో ప్రియమణి చేశారు. పెళ్లీడుకు వచ్చిన అబ్బాయికి తల్లిగా నటించటం ఒక కష్టమైతే.. తన ఏజ్ కు.. తనకున్న గ్లామర్ ఇమేజ్ ను లైట్ తీసుకొని ఈ సినిమాను ఓకే చేయటం ద్వారా పెద్ద సాహసమే చేసింది ప్రియమణి.

ఈ సినిమాలో అనంతపురం జిల్లా యాసలో ప్రియమణి క్యారెక్టర్ మాట్లాడుతుంది. తన పాత్రకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవటం.. అనంత యాసలో మాట్లాడటానికి ఆమెకు చాలానే కష్టం కలిగినట్లు చెప్పింది. అయితే.. తనకు అనంతపురం నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి.. డబ్బింగ్ వేళలో ఏ పదాన్ని ఎలా పలకాలన్న దానిపై ట్రైనింగ్ ఇప్పించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. రెగ్యులర్ తెలుగు అయితే ప్రియమణికి పెద్ద ఇబ్బంది అయ్యేది కాదు.

ప్రత్యేకంగా అనంతపురం యాసను మాట్లాడాల్సి రావటం.. ఏ చిన్న తప్పు దొర్లినా మొత్తం అభాసుపాలు అయ్యే ప్రమాదం ఉంది. అందుకే.. ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రియమణికి శిక్షణ ఇప్పించారని.. డబ్బింగ్ కు ముందు పదాల్ని ఎలా పలకాలో చెప్పేవారని ఆమె చెప్పారు. ''ఒక పదాన్ని మూడు నాలుగు సార్లు అనుకొని చెప్పేశాను. పదీ.. ఇరవై నిమిషాల్లోనే అనంత యాసను పికప్ చేసుకున్నా'' అంటూ తన కసరత్తును బయటపెట్టింది. ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే.. రానున్న రోజుల్లో ఇదే తీరులో మరిన్ని పెద్ద చిత్రాలు ఓటీటీ బాట పట్టటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.