Begin typing your search above and press return to search.

అఫీషియల్: ప్రియుడితో ప్రియాంకా రోకా

By:  Tupaki Desk   |   18 Aug 2018 8:21 AM GMT
అఫీషియల్: ప్రియుడితో ప్రియాంకా రోకా
X
ఇప్పటి దాకా బయట ఎంత కలిసి తిరిగినా తన ప్రియుడు నిక్ జొనాస్ తో తన ప్రేమ వ్యవహారాన్ని మీడియా ముందుకు చెప్పుకోవడానికి ఇష్టపడని బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఎట్టకేలకు తన వివాహ ప్రయాణాన్ని మొదలుపెట్టేసింది. సాంప్రదాయక పంజాబీ పెళ్లిలో మొదటగా జరిపే రోకా వేడుకలో ఇద్దరు కలిసి ఉన్నఫోటోలు ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. అందులో నిక్ కుర్తా పైజామాలో కనిపించడం అసలు విశేషం. దీనికి ప్రియాంకా కజిన్ హీరోయిన్ పరిణితి చోప్రాతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నట్టు సమాచారం. సాధారణంగా రోకా వేడుక తొలి అంకంలో బయటి వారిని అనుమతించరు. అందుకే ఇది గుట్టుగా జరిపినట్టు సమాచారం. నిక్ తల్లితండ్రులు డెనిస్-కెవిన్ జోనాస్ ముంబైలోనే ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇంకా ఎవరెవరు వచ్చారు అనే వివరాలు బయటికి రాలేదు. రోకాలో భాగంగా ఈ సాయంత్రం పార్టీ కూడా ఇవ్వబోతున్నారు. దీనికి రన్వీర్ సింగ్-కరణ్ జోహార్ లాంటి సెలెబ్రిటీలు హాజరు కాబోతున్నారు.

ప్రియాంకా చోప్రా కుటుంబం మొత్తం ఈ వేడుకల ఏర్పాట్లలో తలమునకలై ఉంది. గత రాత్రి ప్రియాంక నిక్ ఇద్దరు కలిసి ఓ హోటల్ లో గ్రాండ్ డిన్నర్ సెలెబ్రేట్ చేసుకున్నారు. అందులో తల్లి మధు సోదరుడు సిద్దార్థ్ చోప్రాతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే ఉన్నట్టు సమాచారం. నిక్ తల్లితండ్రులు గురువారం రాత్రే ఇక్కడికి చేరుకున్నారు. ప్రియాంకా నిక్ ల ఎంగేజ్మెంట్ లండన్ లో తన పుట్టిన రోజు సందర్భంగా జరిగిపోయిందని ఇప్పటికీ బాలీవుడ్ కథనాలు ఉన్నాయి. ఇప్పుడు అధికారికంగా రోకా వేడుకలో నిక్ ఉన్నాడు కాబట్టి ఇక ప్రియాంకా పెళ్లి గురించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. రోకా వేడుకలో భాగంగా ప్రియాంకా కుటుంబ సభ్యులు నిక్ కు సంప్రదాయం ప్రకారం లాంఛనంగా ఇవ్వాల్సిన డబ్బును కానుకగా ఇచ్చి లడ్డుని తినిపించి వీటిని ఆరంభించారు. దీని తర్వాత తాకా అనే మరో వేడుక కూడా ఉంటుంది. దాని ప్రకారం పళ్ళు ఫలాలు బదిలీ చేసుకుంటారు. ఇదంతా సగం పెళ్లితో సమానం. మొత్తానికి ప్రియాంకా చోప్రా తనకన్నా పదేళ్లు చిన్నవాడైన నిక్ ను పరిణయమాడి కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టేసింది. పెళ్లి రిసెప్షన్ తాలూకు వివరాలు ఒక్కొక్కటిగా బయటికి రానున్నాయి. అప్పటి దాకా ఈ ఫోటోలతో సర్దుకోవాల్సిందే.