Begin typing your search above and press return to search.

సల్మాన్ గురించి అడిగితే.. మంటెత్తిపోయింది

By:  Tupaki Desk   |   6 July 2016 10:50 AM GMT
సల్మాన్ గురించి అడిగితే.. మంటెత్తిపోయింది
X
మీడియా వాళ్ల వ్యవహారం చాలా చిత్రంగా ఉంటుంది. ఎవరో ఒక సెలబ్రెటీ ఏదో వివాదాస్పద వ్యాఖ్య చేస్తాడు. దాని గురించి పెద్ద చర్చ నడుస్తుంటుంది. అలాంటి టైంలో ఇంకో సెలబ్రెటీని ఆ వ్యాఖ్య మీద వివరణ అడుగుతారు. ఈ సెలబ్రెటీ.. ఆ సెలబ్రెటీకి మద్దతుగా మాట్లాడినా పెద్ద వార్తే.. వ్యతిరేకంగా మాట్లాడినా వార్తే. ఏం మాట్లాడకపోయినా కూడా వార్తే. ఎలక్ట్రానిక్ మీడియా పెరిగిపోయాక వచ్చిన తలనొప్పి ఇది. ఇలాంటి వ్యవహారాలు సెలబ్రెటీలకు చాలా తలనొప్పిగా తయారవుతోంది. కొందరు ఈ విషయంలో ఓపిక పడతారు కానీ.. ఇంకొందరు మాత్రం మండిపోతారు. మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా ఇలాగే మంటెత్తిపోయింది. ఈ మధ్య సల్మాన్ ఖాన్ తన ‘సుల్తాన్’ సినిమా అనుభవాల గురించి చెబుతూ రెజ్లర్లతో ఫైట్ చేసి వచ్చాక తన పరిస్థితి రేప్ కు గురైన మహిళలా ఉండేదని సరదాగా వ్యాఖ్యానించడం మీద పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై వేరే సెలబ్రెటీల నుంచి బైట్స్ తీసుకోవడం.. దాని మీద చర్చలు నడపడం ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లకు ఆటగా మారిపోయింది. ఐతే అమీర్ ఖాన్ లాంటి కొందరు సెలబ్రెటీలు దీని గురించి స్పందించారు కానీ.. ప్రియాంక చోప్రాకు మాత్రం ఈ టాపిక్ విసుగు తెప్పించింది. తనను ఇప్పటిదాకా 35 సార్లు ఈ ప్రశ్న అడిగారని.. 20 న్యూస్ పేపర్లకు తాను సమాధానం చెప్పానని.. అయినా ప్రశ్నలు ఆగట్లేదని.. సమయం సందర్భం లేకుండా మీడియా వాళ్లు ఇలాంటి ప్రశ్నలు అడగడం ఎంతవరకు సమంజసం అని ఆమె ప్రశ్నించింది. తాను ఎలాంటి కార్యక్రమానికి వచ్చానో కూడా చూసుకోకుండా అసంబద్ధమైన ప్రశ్నలు అడుగుతున్నారని.. ముఖ్యమైన విషయాలను వదిలేసి వివాదాలకు మీడియా ఎక్కువ ప్రచారం కల్పించడం భావ్యం కాదని ఆమె హితవు పలికింది. అయినా ఎవరో ఏదో అంటే ఇలా ప్రతి సెలబ్రెటీని పట్టుకుని రెస్పాన్స్ కోరడం అన్నది సమంజసమైన విషయం కాదు.