Begin typing your search above and press return to search.

ప్రియాంకా పెళ్లి ఫిక్స్ అయినట్టేనా

By:  Tupaki Desk   |   12 Jun 2018 11:21 AM GMT
ప్రియాంకా పెళ్లి ఫిక్స్ అయినట్టేనా
X
బాలీవుడ్ లో పదేళ్లకు పైగా టాప్ హీరోయిన్ గా వెలిగిన ప్రియాంకా చోప్రా త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అనే వార్తలకు బలం చేకూరేలా కొత్త కథనాలు పుట్టుకొస్తున్నాయి. తన కన్నా 11 ఏళ్ళు చిన్నవాడైన హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్ తో ఘాడమైన ప్రేమలో మునిగి తేలుతోందని గత కొంత కాలంగా ముంబై మీడియాలోనే కాదు హాలీవుడ్ పత్రికల్లో సైతం కథనాలు వెల్లువెత్తాయి. రెండు ఇంగ్లీష్ సినిమాలతో పాటు క్వాంటికో సిరీస్ లో నటించిన ప్రియాంకా చాలా కాలం న్యూ యార్క్ లోనే మకాం వేసింది. ఆ సమయంలోనే నిక్ జోనాస్ తో జోరుగా లవ్ స్టోరీ నడిచిందట. దీన్ని ఖండిస్తూ వచ్చిన ప్రియాంకా చోప్రా గత ఏడాది ఒక ఫుట్ బాల్ మ్యాచ్ తో పాటు ఓ అవార్డు ఫంక్షన్ కి రెడ్ కార్పెట్ మీద నిక్ తో కలిసి రావడంతో ఈ అనుమానాలు మరింత బల పడ్డాయి. తాజాగా నిక్ జోనాస్ ఫ్యామిలీ కి చెందిన ఒక ప్రైవేట్ వేడుకకు ప్రియాంకా చోప్రా ప్రత్యేక అతిధిగా రావడమే కాక నిక్ తో చేతిలో చెయ్యి వేసుకుని కలిసి నడవటంతో అనుమానాలకు బలం చేకూరింది.

ప్రియాంకా చోప్రా దీని గురించి బహిరంగంగా చెప్పకపోయినా ఫోటోల ద్వారా తన చేతల ద్వారా తన ఉద్దేశం ఏంటో చెప్పకనే చెబుతోంది. సల్మాన్ ఖాన్ భరత్ సినిమాతో బాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్న ప్రియాంకా కోరి మరీ వివాదాలు కొనితెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. హిప్స్ అండ్ బూబ్స్ అంటూ భారతీయ సినిమా గురించి వెకిలి కామెంట్లు చేయటంతో పాటు క్వాంటికో సీరియల్ లో పాకిస్థాన్ తీవ్రవాదాన్ని వెనకేసుకొచ్చే సీన్స్ లో జీవించి నటించడం చాలా విమర్శలకు దారి తీశాయి. మరో వైపు ఈ ప్రేమ వ్యవహారం. ఏదో ఒక రకంగా మీడియాలో తన పేరు నానే విధంగా చేసుకుంటున్న ప్రియాంకా తెలుగులో రామ్ చరణ్ సరసన తూఫాన్ లో నటించాక మళ్ళి ఇటు వైపు రానే లేదు.