Begin typing your search above and press return to search.

ప్రియాంక కొత్త యాపారం ఏంటో తెలుసా?

By:  Tupaki Desk   |   4 Oct 2018 9:07 AM GMT
ప్రియాంక కొత్త యాపారం ఏంటో తెలుసా?
X
సినీ రంగంలో కోట్లు సంపాదించేవాళ్లు.. ఆ డబ్బును బ్యాంకుల్లో వేసుకుని సైలెంటుగా ఉండిపోరు. తమ ఆదాయాన్ని ఏదో ఒక వ్యాపారంలో పెట్టి దాన్ని మరిన్ని రెట్లు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఫిలిం సెలబ్రెటీల్లో చాలామంది రియల్ ఎస్టేట్‌ లో పెట్టుబడులు పెట్టేసి ప్రశాంతంగా ఉంటారు. కొందరు మాత్రం వినూత్నంగా ఆలోచించి స్టార్టప్స్‌ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ ప్రయత్నంలోనే ఉంది. ఆమె మహిళల కోసం ఏర్పాటైన సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ‘బంబుల్’లో పెట్టుబడి పెట్టడం విశేషం. ఈ వ్యాపారంలో తాను భాగస్వామి అయినట్లుగా ప్రియాంకనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించింది.

ప్రత్యేకంగా యువతులు - మహిళల కోసం రూపొందించిన డేటింగ్ యాప్ బంబల్‌. కేవలం మహిళల కోసమే ఏర్పాటైన మొట్ట మొదటి సోషల్ నెట్‌ వర్కింగ్‌ యాప్‌ ఇది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ యాప్ త్వరలోనే ఇండియాలోకి రానుంది. ఇప్పటికే టెక్‌ స్టార్టప్‌ హోల్బెర్టన్ స్కూల్లో భాగస్వామిగా ఉన్న ప్రియాంక.. తాజాగా ‘బంబుల్’లోనూ పెట్టుబడి పెట్టింది. గత తొమ్మిది నెలలుగా బంబుల్‌ లాంచింగ్‌ - వ్యూహాలు - ప్రచార కార్యక్రమాల్లో ప్రియాంక తలమునకలై ఉన్నట్లు బంబల్‌ సీఈవో విట్నే వోల్ఫ్‌ హెర్డ్‌ చెప్పారు. మహిళలు సురక్షితంగా ఉంటూ.. వేరే వాళ్లతో అనుసంధానం కావాలన్న ఉద్దేశంతో ఈ యాప్ పెట్టామన్నారు.

ఇప్పుడున్న సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు మహిళలకు అంత సురక్షితం కాకపోవడంతో వారిని ఆకట్టుకోలేదని.. తాము అందుకు భిన్నమని.. తమ యాప్‌లో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చామిన ఆయన తెలిపారు. ఇందులో మహిళలు వారి పూర్తి పేర్లకు బదులుగా ప్రొఫైల్ లో కేవలం పేరులోని తొలి అక్షరం మాత్రమే ఉపయోగించుకునేందుకు వీలు కల్పిస్తున్నామన్నారు. గత ఏడాది లాంచ్ అయిన ఈ యాప్ 160 దేశాలలో పనిచేస్తోంది. ఇది ఫోటో వెరిఫికేషన్‌ ఫీచర్‌ ఆధారంగా పనిచేస్తుంది. ఇప్పటికే 2.7 కోట్ల మంది ఈ యాప్ వినియోగిస్తున్నారు. మరి ఈ యాప్ ఇండియాలో ఏమాత్రం పాపులర్ అవుతుంది.. ప్రియాంక భాగస్వామ్యం దీనికి ఏ విధంగా తోడ్పడుతుంది అన్నది చూడాలి.