Begin typing your search above and press return to search.

హీరో వల్లే సినిమా ఫ్లాప్ అయ్యింది

By:  Tupaki Desk   |   14 Jan 2018 6:36 AM GMT
హీరో వల్లే సినిమా ఫ్లాప్ అయ్యింది
X
కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయడం ఎంత ముఖ్యమో దాన్ని పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి అంటే మార్కెటింగ్ చేయటం కూడా అంతే ముఖ్యం. స్టార్ హీరో అయినా ఇప్పుడిప్పుడే పైకొస్తున్న యూత్ హీరోకైనా అందరికి ఇదే సూత్రం వర్తిస్తుంది. అందుకే విడుదల ముందు నుంచి రిలీజ్ అయిన రెండు మూడు వారాల దాకా హీరో హీరొయిన్లు మొదలుకొని టెక్నీషియన్ల దాకా అందరు పాల్గొంటేనే జనానికి చేరని పరిస్థితి ఉంది. కాని ఇది అందరు చేయరు. కొందరు ఉద్దేశపూర్వకంగానో లేక వ్యక్తిగతంగా ఇష్టం లేకపోవడం వల్లనో వీటికి దూరంగా ఉంటారు. కొన్ని సార్లు అవి కూడా వసూళ్ళ పై ప్రభావం చూపిస్తూ ఉంటాయి. గతంలో దివంగత దాసరి గారు కూడా ఒక వేదికపై దీనిపై బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు.

తాజాగా కోలీవుడ్ లో ఇలాంటి వివాదం ఒకటి మొదలైంది. తమిళ్ హీరో జై - అంజలి నటించిన బెలూన్ అనే సినిమా డిసెంబర్ చివరి వారంలో విడుదలైంది. తెలుగులో కూడా డబ్ చేసారు కాని విపరీతమైన పోటీ ఉండటం వల్ల వాయిదా వేసుకుంటూ వచ్చి చివరికి చేయలేకపోయారు. అక్కడ ఆ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుని నిర్మాతకు నష్టాలు మిగిల్చింది. దానికి కారణం హీరో జై అంటూ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేసే దాకా వెళ్ళింది వ్యవహారం. షూటింగ్ కి టైంకి రాకపోవడం వల్ల జూన్ లో విడుదల కావలసిన మూవీ డిసెంబర్ లో రాంగ్ టైంలో విడుదల చేయాల్సి వచ్చిందని అతను వాపోతున్నాడు.

తనకు కోటిన్నరకు పైగా ప్రొడక్షన్ లోనే లాస్ వచ్చిందని, ఇప్పుడు సినిమా ఫ్లాప్ కావడంతో తాను తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయానని చెబుతున్నాడు నిర్మాత. ప్రమోషన్ విషయంలో కూడా జై యాక్టివ్ గా ఉండకపోవడం వల్లే అనుకున్న స్థాయిలో సినిమా జనానికి రీచ్ కాలేదని ఆరోపిస్తున్న సదరు నిర్మాత సినిమాలో కంటెంట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది అని చెబుతున్నాడు. హారర్ జానర్ లో రూపొందిన బెలూన్ పర్వాలేదు అని టాక్ తెచ్చుకున్నా చివరికి ఫ్లాప్ ముద్ర వేయించుకుని నిర్మాతకు ట్విస్ట్ ఇచ్చింది. ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.