Begin typing your search above and press return to search.

నిర్మాత బన్నీ వాసుకు త్రుటిలో తప్పిన ప్రమాదం

By:  Tupaki Desk   |   18 July 2022 4:45 AM GMT
నిర్మాత బన్నీ వాసుకు త్రుటిలో తప్పిన ప్రమాదం
X
సెలబ్రిటీలు.. ప్రముఖులు గట్టున ఉండి మాటలు చెప్పే వారే కానీ.. స్వయంగా సీన్లోకి వెళ్లే వారు చాలా తక్కువగా ఉంటారు. రోటీన్ కు భిన్నంగా సాయం చేయాల్సి వచ్చిన వేళ.. వాళ్లను వీళ్లను కాకుండా తానే రంగంలోకి దిగిన వైనం చూస్తే.. టాలీవుడ్ నిర్మాత కమ్ జనసేన నేత బన్నీ వాసు సాహసానికి మెచ్చుకోవాల్సిందే. అయితే.. సాయం చేసే క్రమంలో ఆయన ఒక ప్రమాదం నుంచి జస్ట్ మిస్ అయ్యారు. గగుర్పాటుకు గురి చేసే ఈ ఉదంతంలోకి వెళితే..

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వరద పోటు ఎక్కువగా ఉండటం తెలిసిందే. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు అందిస్తున్న బన్నీ వాసు ఇందులో భాగంగా పెద్ద సాహసమే చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచలి మండలం బాడవ గ్రామంలో ఒక గర్భిణి వరదలో చిక్కుకున్నారు. ఆమెతో పాటు మరికొందరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు.

వారిని రక్షించేందుకు రంగంలోకి దిగారు బన్నీ వాసు. ఒక పడవలో వారి వద్దకు వెళ్లి.. వారిని అందులోకి క్షేమంగా చేర్చారు. తిరిగి వస్తున్న వేళ.. వరద తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో వరద పోటు ఎక్కువగా ఉండటంతో.. వారు ప్రయాణిస్తున్న పడవ అదుపు తప్పింది. పడవ వెళ్లి కొబ్బరి చెట్టుకు ఢీ కొట్టింది. ఈ సమయంలో పడవ నడిపే వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించటంతో పడవ ఆగింది.

ఈ సందర్భంగా పడవ లోపలి వారు టెన్షన్ పడటంతో.. పడవ కాస్తా ఒక పక్కకు ఒరిగింది. దీంతో పడవ నడిపే వ్యక్తులు ప్రమాదాన్ని ఊహించి జాగ్రత్తలు తీసుకోవటంతో పడవ ఒరిగిపోకుండా చేశారు.

పెద్ద ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న బన్నీ వాసు.. గర్భిణితో పాటు మిగిలిన వారు ఊపిరి పీల్చుకున్నారు. లక్కీగా ప్రమాదం తప్పిందన్న బన్నీ వాసు.. లంక గ్రామాల్లోని ప్రజలంతా ప్రమాదం అంచున ఉన్నారన్నారు.

ప్రభుత్వం వెంటనే సహాయక చర్యల్ని మరింత ముమ్మరం చేయాలన్నారు. ఏమైనా.. సాయం చేయాలనుకోవటం వేరు.. సాయం చేసేందుకు వెనుకా ముందు చూసుకోకుండా ముందుకు వెళ్లటం మామూలు విషయం కాదు. దీనికి సంబంధించి బన్నీ వాసును అభినందించాల్సిందే.