Begin typing your search above and press return to search.

నిర్మాతల మండలి పరువు తీయొద్దు: సి.కల్యాణ్

By:  Tupaki Desk   |   19 Dec 2022 4:49 PM GMT
నిర్మాతల మండలి పరువు తీయొద్దు: సి.కల్యాణ్
X
తెలుగు చ‌త్ర‌సీమ ప్ర‌స్తుతానికి స్థ‌బ్ధుగా క‌నిపిస్తున్నా.. ఇక్క‌డ ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఊహించ‌లేం! ఇప్పుడు అనూహ్యంగా  నిర్మాత‌ల మండ‌లిలో అంత‌ర్యుద్ధం బ‌య‌ట‌ప‌డింది. నిజానికి ఇది ఈనాటిది కాదు. ఇక్కడ వ‌ర్గ‌పోరు ఎప్పుడూ బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. ముఖ్యంగా ఎన్నిక‌ల వేళ అస‌లు కుతంత్రాలు బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. ఇప్పుడు నిర్మాత‌ల మండ‌లిని డామినేట్ చేస్తూ యాక్టివ్ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ఏర్ప‌డ‌డంతో ర‌చ్చ మ‌రో లెవ‌ల్ కి చేరుకుంది.

ఇక‌పోతే నిర్మాత‌ల మండ‌లికి కొత్త బాడీ ఏర్పాటు చేసేందుకు ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉండ‌గా అది అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది. దీనిపై కొంద‌రు బ‌హిరంగంగా అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం ఇప్పుడు వ‌ర్గ‌పోరున‌కు తెర తీస్తోంద‌ని స‌మాచారం.

నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌లు జ‌ర‌పాల్సిందేనంటూ.. నిర్మాతల రిలే నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నామ‌ని ప్ర‌క‌టించ‌గానే దానిపై ప్ర‌స్తుత అధ్య‌క్షుడు నిర్మాత సి.కల్యాణ్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ప్ర‌ముఖ మీడియాతో మాట్లాడిన ఆయ‌న తాను చెన్నైలో ఉన్నాన‌ని.. దీక్ష విషయం తెలియద‌ని అన్నారు.

నిర్మాతల మండలిలో అన్నీ సవ్యంగా జరుగుతున్నాయని చెప్పిన సీ కల్యాణ్ ఆక‌స్మికంగా తాను లేన‌ప్పుడు రిలే నిరాహార దీక్షకు పూనుకోవ‌డాన్ని తప్పుబట్టారు. ఎన్నిక‌ల‌పైనా ఆయ‌న స్పందించారు. మ్యానువల్ బుక్ ప్రింట్ అవగానే ఎలక్షన్ పెడతామ‌ని అన్నారు. మూడు రోజుల క్రితమే మ్యానువల్ బుక్ ను ప్రింటింగ్ కు పంపించామ‌ని కూడా వెల్ల‌డించారు.

ప్రతి నిర్ణయం ఈసీకి పాస్ చేసిన తర్వాతే అమలవుతుంద‌ని... ఏదైనా సమస్య ఉంటే నాతో మాట్లాడాలని ఆయ‌న కోరారు. అనవసర చర్యలతో నిర్మాతల మండలి పరువు తీయొద్ద‌ని సి. కల్యాణ్ అభ్య‌ర్థించారు. ఈ నెల 22న నేను హైదరాబాద్‌కు వస్తున్నా.. అంతా సవ్యంగా జరుగుతుందని ఆయ‌న తెలిపారు. ద‌క్షిణాది చ‌ల‌న చిత్ర‌మండ‌లిలో ప‌లు ప‌ద‌వుల‌ను సి.క‌ళ్యాణ్ ఇదివ‌ర‌కూ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.