Begin typing your search above and press return to search.

ఇంద్రగంటి తనతో సినిమా వద్దన్నాడట..

By:  Tupaki Desk   |   3 July 2016 3:30 PM GMT
ఇంద్రగంటి తనతో సినిమా వద్దన్నాడట..
X
సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ఏమైనా చేసేవాళ్లుంటారు. నిర్మాతల శ్రేయస్సు గురించి ఆలోచించే దర్శకులు.. చాలా తక్కువ. అవతలి వాళ్లు ఎంత ఇబ్బంది పడితే ఏంటి.. తమ కడుపు నిండితే చాలనే చాలామంది అనుకుంటారు. ఐతే పెద్ద ఫ్లాప్ సినిమా తీసిన తనకు ఓ నిర్మాత పిలిచి అవకాశమిస్తానంటే ఓ దర్శకుడు వద్దు అన్నాడట. తన ట్రాక్ రికార్డు వల్ల నిర్మాత ఇబ్బంది పడకూడదని సినిమా నుంచి తప్పుకునే ప్రయత్నం చేశాడట. ఆ దర్శకుడు మరెవరో కాదు.. ‘జెంటిల్ మన్’ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ. అతను చేయబోయిన త్యాగం గురించి నిర్మాత శివలెంక కృష్ణప్రసాదే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘‘నిర్మాతగా నా కెరీర్లో ‘ఆదిత్య 369’ ఎంత ప్రత్యేకమో ‘జెంటిల్ మన్’ కూడా అంతే. విశేషం ఏంటంటే.. ఈ రెండు సినిమాల విషయంలో నన్ను గైడ్ చేసింది బాలూగారే. ఒకప్పుడు సింగీతంతో ఆదిత్య 369 సినిమా చేయమని సలహా ఇచ్చిన ఆయనే.. రెండేళ్ల కిందట మళ్లీ పిలిచి ఇంద్రగంటితో సినిమా తీస్తే బాగుంటుందన్నారు. ఐతే ‘బందిపోటు’ సినిమా ఫ్లాపయ్యాక మోహన్‌ కృష్ణ గారు నా దగ్గరికి వచ్చి.. ‘మీరు ఇబ్బందుల్లో ఉన్నారు. నా సినిమా కూడా సరిగా ఆడలేదు. కాబట్టి నా గురించి ఆలోచించకుండా మీరు నిర్ణయం తీసుకోండి’ అని చెప్పారు. ఆయన సంస్కారం చూసి ఆశ్చర్యమేసింది. సినీ రంగంలో నేనూ ఎత్తుపల్లాల్ని చూశాను కాబట్టి ఒక సినిమా ఫ్లాపైనంత మాత్రాన కమిట్మెంట్ వెనక్కి తీసుకోకూడదని భావించి ఇంద్రగంటితోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. డేవిడ్ నాథన్ నాకు చాలా కాలం కిందట చెప్పిన కథను ఆయనకు చెప్పడం.. ఆయనకు నచ్చడం.. ఆ కథకే మార్పుల చేసి ‘జెంటిల్ మన్’ తీయడం.. చకచకా అయిపోయాయి. మా నమ్మకానికి తగ్గట్లే ‘జెంటిల్‌ మన్‌’ విజయం సాధించి నిర్మాతగా మళ్లీ నన్ను నిలబెట్టింది’’ అని కృష్ణప్రసాద్ అన్నారు.