Begin typing your search above and press return to search.

శింబుపై సంచలన ఆరోపణలు

By:  Tupaki Desk   |   1 Dec 2017 7:25 AM GMT
శింబుపై సంచలన ఆరోపణలు
X
కోలీవుడ్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటాడు హీరో శింబు. ఇప్పటికే అతడి మీద ఎన్నో వివాదాలున్నాయి. అప్పట్లో బీప్ సాంగ్ కాంట్రవర్శీ అతడిని ఎంత ఇబ్బందుల పాలు చేసిందో తెలిసిందే. తాజాగా ‘ఏఏఏ’ అనే సినిమాకు సంబంధించి పెద్ద వివాదంలోనే చిక్కుకున్నాడు శింబు. అతడి మీద తమిళ పరిశ్రమ నిషేధం విధించే పరిస్థితి కనిపిస్తోంది. అధికారికంగా అతడిని నిషేధించకపోయినా.. ఇకపై నటీనటులు.. టెక్నీషియన్లు.. నిర్మాతలు అతడిని అనధికారికంగా నిషేధించే అవకాశాలు కనిపిస్తన్నాయి. ‘ఏఏఏ’ సినిమా విషయం ఆ స్థాయి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు శింబు. ఈ చిత్రాన్ని నిర్మించిన మైకేల్ రాయప్పన్ అనే నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి మరీ శింబుపై తీవ్ర ఆరోపణలు చేశాడు.

‘ఏఏఏ’ సినిమా శింబు వల్లే అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నాడు మైకేల్. ఈ సినిమాకు కేటాయించిన డేట్లలో 35 శాతం మాత్రమే షూటింగుకి వచ్చాడని.. తనకు ఇష్టం వచ్చిన చోటికి షూటింగ్ లొకేషన్లు మార్చాడని.. అతడి వల్ల ఇతర నటీనటుల డేట్లు వృథా అయ్యాయని అన్నాడు మైకేల్. ఈ సినిమాకు 5 పాటలు అనుకుంటే ఒక్క పాట మాత్రమే షూట్ చేయగలిగామని.. ఈ సినిమాతో మూడు పాత్రలు చేయాల్సిన శింబు.. రెండు పాత్రలు చేసి.. ఇంకో పాత్ర అవసరం లేదన్నాడని.. తప్పదంటే సినిమాను రెండు భాగాలు చేసి రెండో పార్టులో మూడో పాత్రను చూపిద్దామని అన్నాడని.. దర్శకుడు అతడి కాళ్ల మీద పడి శింబు ఇంట్లోనే మూడో పాత్రకు సంబంధించి కొన్ని గంటల్లోనే కొన్ని సన్నివేశాలు తీయాల్సి వచ్చిందని చెప్పాడు.

మూడు పాత్రల్లో వేరియేషన్ కోసం బరువు తగ్గుతానని చెప్పిన శింబు మాట తప్పాడని.. మేకప్ కూడా సరిగా వేయించుకోలేదని అన్నాడు. శింబు డబ్బింగ్ థియేటరుకు వచ్చి డబ్బింగ్ కూడా చెప్పలేదని.. బాత్ రూం నుంచి ఆడియో రికార్డర్లో డైలాగులు రికార్డ్ చేసి తమకు పంపితే.. దాన్ని అతి కష్టం మీద మిక్సింగ్ చేయించామని మైకేల్ తెలిపాడు. శింబు ఇలా అనేక రకరాలుగా ఇబ్బంది పెట్టాడని.. సినిమాను చంపేశాడని.. అతుకుల బొంతలా సినిమాను రిలీజ్ చేయడంతో అది ఫ్లాప్ అయిందని.. తాను రోడ్డు మీదికి వచ్చానని.. శింబుతో తనకు నష్టపరిహారం ఇప్పించాలని మైకేల్ డిమాండ్ చేశాడు.