Begin typing your search above and press return to search.

ప్రేక్షకులకు 'భీమ్లా నాయక్' నిర్మాత క్షమాపణలు..!

By:  Tupaki Desk   |   18 Feb 2022 3:24 PM GMT
ప్రేక్షకులకు భీమ్లా నాయక్ నిర్మాత క్షమాపణలు..!
X
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వరుసగా హిట్టు చిత్రాలను నిర్మిస్తూ అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు సూర్యదేవర నాగవంశీ సితార. మీడియా ముందు పెద్దగా కనిపించని యువ నిర్మాత.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో ప్రేక్షకులను ఉద్దేశించి నాగవంశీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

వివరాల్లోకి వెళ్తే.. సిద్ధు జొన్నలగడ్డ - నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి నాగవంశీ నిర్మించిన సినిమా ''డీజే టిల్లు''. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. విజయోత్సవంలో భాగంగా వైజాగ్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులు సినిమా కలెక్షన్స్ గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు.

దీనికి నాగవంశీ స్పందిస్తూ.. ''ఈ లెక్కలన్నీ మనలాంటి మేధావులకు కావాలి కానీ.. ఆడియన్ గా వాడిచ్చే 150 రూపాయలకు వాడు నవ్వుకున్నాడా? లేడా అనేది సరిపోతుంది. వాడిచ్చే 150 రూపాయలకు 1500 విలువ నవ్వించాం. అదే చాలు వాడికి. వాడు హ్యాపీ'' అని కామెంట్స్ చేశారు. దీనిపై వివాదం చెలరేగింది.

నాగవంశీ ఆడియన్స్ ను వాడు - వీడు అని సంబోధిస్తూ మాట్లాడడం పై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సినిమా రిలీజ్ కు ముందు ప్రేక్షక దేవుళ్ళు అని అంటారు.. సినిమా హిట్టయ్యాక ఏక వచనంతో గౌరవం లేకుండా మాట్లాడతారని సోషల్ మీడియాలో నాగవంశీని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఎన్నో ఏళ్లుగా సినిమాలు తీస్తున్న అగ్ర నిర్మాతలు కూడా ఎప్పుడు ఇలా మాట్లాడలేదని విరుచుకుపడ్డారు.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే నాగవంశీ.. త్వరలో సినిమాల రిలీజులు ఉన్నాయి.. ఎందుకొచ్చిన గొడవ ఏమనుకున్నారో ఏమో కానీ.. ప్రేక్షకులను క్షమాపణలు కోరారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ నోట్ పెట్టాడు. ప్రేక్షకులను తన సోదరులుగా భావించటం వల్లే ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడానని.. ప్రేక్షకులు అంటే తమకెంతో గౌరవం ఉందని పేర్కొన్నారు.

"ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం. వారే ఏ నిర్మాణ సంస్థ కైనా బలం. ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామన్న ఆనందంలో 'డిజె టిల్లు' విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించాయన్న వార్తలు తెలిసి బాధపడ్డాను.

ప్రేక్షకులను ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడటం, వారిని నా సోదరులుగా భావించటం వల్లే. అయినా వారి మనసు నొచ్చు కోవటం పట్ల క్షంతవ్యుడిని. ముందుగా చెప్పినట్లే ఎప్పటికీ ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం, వారే మా బలం'' అని నాగవంశి రాసుకొచ్చారు.

ఇదిలా ఉంటే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మించిన 'భీమ్లానాయక్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇందులో పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే-మాటలు అందించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. దీనికి 'యూ/ఏ' (U/A) సర్టిఫికేట్ వచ్చినట్లు మేకర్స్ తెలియజేసారు.