Begin typing your search above and press return to search.

చచ్చిన తర్వాత కూడా 'గబ్బర్ సింగ్' నిర్మాతనే గర్వం ఉంటుంది..!

By:  Tupaki Desk   |   4 Feb 2022 12:30 PM GMT
చచ్చిన తర్వాత కూడా గబ్బర్ సింగ్ నిర్మాతనే గర్వం ఉంటుంది..!
X
తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యనటుడుగా ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్.. ఆ తర్వాత కాలంగా స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో నటుడుగా రీఎంట్రీ ఇచ్చిన బండ్ల.. ఇప్పుడు పూర్తిస్థాయి లీడింగ్ రోల్ లో ''డేగల బాబ్జీ'' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వెంకట్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని యశ్ రుషి బ్యానర్ పై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు.

తమిళంలో ఘన విజయం సాధించిన ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ (ఒక్కటే చెప్పు సైజ్ 7) చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్ గా ''డేగల బాబ్జీ'' సినిమా రూపొందుతోంది. పార్థీబన్ ప్రధాన పాత్రలో ఆయన దర్శక నిర్మాణంలోనే తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు.. పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడింది. పార్థీబన్ పోషించిన ఎమోషనల్ పాత్రలో బండ్ల గణేష్ కనిపించనున్నారు.

'డేగల బాబ్జీ' సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో సినిమాలోని 'కన్నానే.. కలగా మిగిలేనే' అనే సాంగ్ లిరికల్ వీడియోను గురువారం రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. అభయ్ జోధ్ పుర్కర్ ఆలపించిన ఈ పాటకు అనూహ్యమైన స్పందన వస్తోందని అన్నారు. ఈ చిత్రానికి సపోర్ట్ చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి, హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

''ప్రముఖ నటుడు పార్థీబన్ చేసిన ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సినిమా హక్కులను తీసుకున్నానని నా మిత్రుడు వెంకట్ చంద్ర చెప్పడం జరిగింది. తెలుగులో స్టార్ హీరోలు ఎవరు చేసినా ఈ సినిమా చాలా బాగుంటుందనుకొన్నాను. అయితే అనూహ్యంగా నన్ను నటించమని చెపితే.. 'నేను యాక్ట్ చేయడమేమిటి.. నేను యాక్టింగ్ మర్చిపోయాను. అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేసిన పార్థీబన్ ఎక్కడ.. నేనెక్కడ.. నేను చేయలేను.. అయినా నేనిప్పుడు సినిమా తీద్దామనుకుంటున్నాను.. యాక్ట్ చేయను' అని చెప్పాను. అయితే కథ చాలా బాగుందని నన్ను కన్విన్స్ చేయడంతో.. సినిమా చేయడానికి ఒప్పుకున్నాను'' అని బండ్ల గణేష్ అన్నారు.

''ఒక రూమ్‌ లో ఒక సినిమాని రెండు గంటల సేపు ఒక క్యారెక్టర్ చేయడం అనేది చాలా రిస్క్. అలాంటి కథను నా భుజాన పెట్టి నాతో చేయించారు. సినిమా చేసే వరకు నాలో గుండె దడ దడ కొట్టుకునేది.. భయమేసేది. సినిమా చేసే క్రమంలో నేను చేయగలననే ధైర్యం వచ్చింది. సినిమా అయిపోయిన తర్వాత నేనే ఆశ్చర్యపోయాను. నేనేనా ఇలా యాక్ట్ చేసింది అని నాలో నాకే ఆనందం వేసింది. నా జీవితానికి ఒక నటుడిగా ఇది చాలు అని అనుకున్నాను'' అని బండ్ల తెలిపారు.

''పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ గారితో 'గబ్బర్ సింగ్' సినిమా తీసినప్పుడు ఎంత హాయిగా కాలరెగరేసి తృప్తిగా ఉన్నానో.. నేను చచ్చిపోయిన తర్వాత కూడా గబ్బర్ సింగ్ నిర్మాత అనే గర్వం ఎలా ఉంటుందో.. ఈ 'డేగల బాబ్జీ' చిత్రం కూడా నాకు అంత తృప్తినిచ్చింది. ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ కళ్లార్పకుండా చూస్తారు. అంత అద్భుతంగా వచ్చింది. బండ్ల గణేష్ అనే వ్యక్తి ఇంత బాగా నటిస్తాడా అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ తర్వాత నాపై గౌరవం పెరుగుతుంది. నటుడిగా ఇలాంటి గౌరవం కోసమే నేను ముప్పై ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. నిజంగా నా జీవితానికి అర్థం చెప్పే సినిమా ఇది. భవిష్యత్తులో నేను యాక్ట్ చేస్తానో లేదో తెలియదు. కానీ ఈ సినిమా ద్వారా నా జన్మ ధన్యమైందని అనుకుంటున్నాను'' అని బండ్ల గణేష్ అన్నారు.

''చంద్ర వెంకట్ ఇండస్ట్రీలో మరో గొప్ప డైరెక్టర్ అవుతాడు. ఒక పూరి జగన్నాథ్ లాగా కన్ఫ్యూజన్ లేకుండా స్పీడ్ గా చేశాడు. ఒక రీమేక్‌ ని అద్భుతంగా మలిచాడు. గొప్ప దర్శకుడికి ఉండే లక్షణాలు అన్నీ తనకు ఉన్నాయి. నేషనల్ అవార్డు విన్నింగ్ చిత్రాన్ని తెలుగులో చేయడానికి ఎవరూ సాహసించరు. కానీ ఆ సినిమాను తీసుకొని నాతో యాక్ట్ చేయించడం ఒక ఎత్తు. ఇప్పటి వరకు నన్ను ఆదరించినట్టే 'డేగల బాబ్జీ' సినిమాను ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. మా బాస్‌ తో ఈ సినిమాను ఓపెన్ చేయిద్దాం అన్నారు. కోవిడ్ టైములో వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు.. వారందరి ఆశీర్వాదాలు నాకు ఎప్పుడు ఉంటాయని వద్దన్నాను. త్వరలో వస్తున్న ఈ సినిమా మీ అందరి అభిమానం పొందుతూ దర్శకుడికి, నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది'' అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.