Begin typing your search above and press return to search.

ప్ర‌ముఖ నిర్మాత కుమారుడి మృతి!

By:  Tupaki Desk   |   8 May 2018 10:33 AM GMT
ప్ర‌ముఖ నిర్మాత కుమారుడి మృతి!
X
ప్రముఖ సినీ నిర్మాత - భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అధినేత ఎస్.గోపాల్ రెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డి(47) అనుమానాస్పద స్థితిలో మంగ‌ళ‌వారం ఉద‌యం మృతి చెందారు. నెల్లూరులోని వాకాడ సముద్రంలో ఆయ‌న ప్ర‌మాద‌వ‌శాత్తు మునిగిపోయి చ‌నిపోయిన‌ట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి 11 గంట‌ల స‌మయంలో పంబ‌లి వ‌ద్ద వాకాడ బీచ్ కి వచ్చిన భార్గవ్...మంగ‌ళ‌వారం ఉదయం బీచ్ ఒడ్డున శ‌వ‌మై తేలారు. అయితే, ఒక కుక్క పిల్లను కాపాడే క్ర‌మంలో సముద్రంలోకి వెళ్లిన భార్గ‌వ్....అల‌లధాటికి లోప‌ల‌కు కొట్టుకుపోయి మరణించినట్టు కొంద‌రు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

మృతదేహానికి పోస్టుమార్టం నిర్వ‌హించిన అనంతరం మ‌రిన్ని వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు చెప్పారు. భార్గవ్ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చెన్నైలో నివాసం ఉంటున్న భార్గవ్ కు నెల్లూరు జిల్లా వాకాడు సమీపంలో రొయ్యల హ్యాచరీ ఉంది. ఆ హ్యాచ‌రీ వ‌ద్ద‌కు వ‌చ్చిన భార్గ‌వ్ ...ప్ర‌మాద‌వ‌శాత్తూ మృతిచెంద‌డం స్థానికుల‌ను క‌ల‌చి వేసింది. భార్గ‌వ్ హ‌ఠాన్మ‌ర‌ణంతో అత‌డి కుటుంబంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. భార్గ‌వ్ మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. 80 - 90వ ద‌శ‌కంలో త‌న కొడుకు భార్గ‌వ్ పేరుతో ఏర్పాటు చేసిన `భార్గవ్ ఆర్ట్స్`నిర్మాణ సంస్థ ద్వారా ఎస్ గోపాల్ రెడ్డి ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు నిర్మించిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ కు మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు - ముద్దుల మావ‌య్య‌ - మువ్వ గోపాలుడు వంటి చిత్రాలు ఆ జాబితాలో ఉన్నాయి. ఎస్. గోపాల్ రెడ్డి...2008లో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.