Begin typing your search above and press return to search.

ఆ నిర్మాత ఈసారైనా బ్లాక్ బస్టర్ రుచి చూసేనా..?

By:  Tupaki Desk   |   28 July 2022 3:47 AM GMT
ఆ నిర్మాత ఈసారైనా బ్లాక్ బస్టర్ రుచి చూసేనా..?
X
మాస్ మహారాజా రవితేజ నటించిన ''రామారావు ఆన్ డ్యూటీ'' సినిమా రిలీజ్ కు రెడీ అయింది. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ రేపు శుక్రవారం (జూలై 29) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. 'ఖిలాడి' వంటి ప్లాప్ తర్వాత రవితేజ కు ఈ మూవీ సక్సెస్ అవడం ఎంతో అవసరం. అలానే ఎప్పటి నుంచో అసలు సిసలైన బ్లాక్ బస్టర్ కోసం వేచి చూస్తున్న నిర్మాత సుధాకర్ చెరుకూరి కూడా ఈ ప్రాజెక్ట్ పై చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు.

ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేర్లలో సుధాకర్ చెరుకూరి ఒకటి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ అనే బ్యానర్ మీద విభిన్నమైన మరియు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను నిర్మిస్తూ మంచి అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు. కాకపోతే అందుకు తగ్గట్టుగా ఇప్పటి వరకూ సరైన ఫలితం అందుకోలేకపోతున్నాడు. కాంబినేషన్స్ సెట్ చేస్తున్నాడు కానీ.. కమర్షియల్ సక్సెస్ రుచి చూడలేకపోతున్నాడు.

'పడి పడి లేచె మనసు' చిత్రంతో పూర్తి స్థాయి నిర్మాతగా మారాడు సుధాకర్ చెరుకూరి. తొలి సినిమాకే అందమైన ప్రేమకథను ఎంచుకున్నాడు. శర్వానంద్ - సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఫస్ట్ ప్రాజెక్ట్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతోనే లేదా మరేదైనా కారణం చేతనో తెలియదు కానీ.. మరో సినిమా చేయడానికి నిర్మాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్నాడు.

ఈ క్రమంలో శర్వానంద్ - రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను రూపొందించారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. దీని తర్వాత రానా దగ్గుబాటి - సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో 'విరాట పర్వం' వంటి కథాబలం ఉన్న చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ కమర్షియల్ గా హిట్ సాధించలేకపోయింది. ఓటీటీలో మాత్రం ఈ చిత్రానికి విశేష ఆదరణ దక్కింది.

ఇలా ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ లో రొటీన్ సినిమాలకు పూర్తి భిన్నంగా మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే నిర్మించారు కానీ.. సరైన బాక్సాఫీస్ విజయం మాత్రం దక్కలేదు. అయినా సరే వెనుకంజ వేయకుండా ఇప్పుడు రవితేజ తో 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా చేసాడు సుధాకర్. రవితేజ వంటి మాస్ హీరో డేట్స్ ఉన్నా.. ఈసారి కూడా రొటీన్ మాస్ మాసాలా మూవీ తీయకుండా స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు.

ఇప్పటి వరకూ 'రామారావు ఆన్ డ్యూటీ' నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ గత చిత్రాలకు పూర్తి భిన్నమైన కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. హీరో సైతం ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామిగా చేరాడంటే.. కంటెంట్ మీద ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థం అవుతుంది.

సినిమా అనేది కొన్ని కోట్లతో కూడుకున్న వ్యవహారం. ఎంత ఫ్యాషన్ తో సినిమాలు చేసినా.. దీన్ని వ్యాపార కోణంలోనూ చూడాలి. ఖర్చు చేసిన పెట్టుబడి వెనక్కి తిరిగి రావాలి.. లాభాలు అందుకోవాలి. అలా అయితేనే మరిన్ని మంచి చిత్రాలు ప్రేక్షకులకు అందివ్వగలరు. ఇప్పుడు 'రామారావు..' సక్సెస్ అయితే చెరుకూరి సుధాకర్ అదే బాటలో మరిన్ని కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఇకపోతే 'రామారావు ఆన్ డ్యూటీ' తర్వాత నాని - కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా 'దసరా' అనే సినిమా చేస్తున్నాడు సుధాకర్. దీంతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్. తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇదే క్రమంలో నాగశౌర్య హీరోగా ప్రొడక్షన్ నెం.6 చిత్రాన్ని రూపొందించనున్నారు.