Begin typing your search above and press return to search.

ప్రైమ్ దూకుడుకి మళ్ళి నిర్మాతల టెన్షన్

By:  Tupaki Desk   |   3 July 2019 7:05 AM GMT
ప్రైమ్ దూకుడుకి మళ్ళి నిర్మాతల టెన్షన్
X
ఆమధ్య ఏప్రిల్ 1 నుంచి కొత్త సినిమాలు విడుదల అయిన రెండు నెలల తర్వాతే డిజిటిల్ లేదా శాటిలైట్ ప్రసారాలు జరగాలని మన నిర్మాతలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇది కొంతవరకు అమలవుతుండగా పూర్తి స్థాయిలో మాత్రం పాటించడం లేదు. మొన్న ఫలక్ నుమా దాస్ అమెజాన్ ప్రైమ్ లో వచ్చేయడం ఉదాహరణగా చెప్పొచ్చు. యాభై రోజులు ముగియడం ఆలస్యం మహర్షి ఆన్ లైన్ లో చక్కర్లు కొట్టేస్తోంది. పట్టుమని నెల తిరక్కుండానే సీతను పెట్టేశారు. జెర్సి కూడా టీవీ ప్రీమియర్ కంటే ముందే జీ సంస్థ యాప్ లో స్ట్రీమింగ్ పెట్టింది.

ఇలా చాలానే ఉన్నాయి కానీ ఈ దూకుడు మరోసారి చిన్న నిర్మాతలను టెన్షన్ పెడుతోంది. కారణంగా గత కొంత కాలంగా మీడియం బడ్జెట్ సినిమాలకు మంచి మార్కెట్ వస్తోంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ-బ్రోచేవారెవరురా-మల్లేశం లాంటివి వాటి బడ్జెట్ కు అనుగుణంగా మంచి రిటర్న్స్ తెచ్చి పెడుతున్నాయి. అదే సమయంలో వీడియో స్ట్రీమింగ్ సైట్స్ ఇలా వరుసగా కొత్త సినిమాలను పెట్టేస్తూ పొతే థియేటర్ కు ఏం వెళతాం అనే నిర్లిప్తత ప్రేక్షకుల్లో వచ్చే ప్రమాదం ఉంది.

ఇది గుర్తించే అరవై రోజులు గడువు నిబంధన తెచ్చారు. కానీ అమెజాన్ లాంటి సంస్థలు ఇస్తున్న టెంప్టింగ్ ఆఫర్స్ కి నో చెప్పడం మనవాళ్ళ వల్ల కావడం లేదు. దీని వల్ల థియేటర్లకు చేటు తప్పేలా లేదు. ఓ నెల నెలన్నర ఓపిక పడితే ఆన్ లైన్లో వచ్చేస్తుంది కదా అన్న ఊహ వసూళ్లపై ప్రభావం చూపుతుంది. సక్సెస్ మీట్ లో హీరో శ్రీవిష్ణు పదే పదే థియేటర్లోనే సినిమా చూడండి అని నొక్కి చెప్పడం చూస్తే డిజిటల్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది