Begin typing your search above and press return to search.

డిజిటల్ రిలీజ్ పై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   20 March 2019 8:17 AM GMT
డిజిటల్ రిలీజ్ పై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం
X
ఫిలిం మేకర్స్ కు తమ పెట్టుబడిని రికవర్ చేసుకునేందుకు థియేట్రికల్ రైట్స్ మాత్రమే కాకుండా ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. శాటిలైట్ రైట్స్.. హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా మన తెలుగు మేకర్స్ కు అధిక ఆదాయం సమకూరుతోంది. ఆడియో.. ఇతర రైట్స్ పై కూడా కొంత ఆదాయం వస్తుంది. గత కొన్నేళ్ళలో నిర్మాతలకు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కల్పవృక్షంలా మారాయి. అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్ లాంటి డిజిటల్ ప్లేయర్స్ కు డిజిటల్ హక్కులు అమ్మడం ద్వారా మంచి ఆదాయం వస్తోంది.

కాకపోతే థియేట్రికల్ రిలీజ్ కు డిజిటల్ రిలీజ్ కు గ్యాప్ తగ్గడంతో కొన్ని సందర్భాలలో డిస్ట్రిబ్యూటర్లు.. బయ్యర్లు నష్టపోవాల్సి వస్తోంది. సినిమా హిట్ అయ్యి లాంగ్ రన్ ఉన్నప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాంలో అందుబాటులోకి వస్తే ఆ సమయంలో అధికశాతం ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళడం మానేస్తున్నారు. మరోవైపు సినిమా విడుదలైన రెండు మూడువారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తుండడంతో కొంతమంది ప్రేక్షకులు హెచ్ డీ క్వాలిటీ తో సినిమాను ఇంట్లోనే చూడొచ్చనే ఉద్దేశంతో థియేటర్ కు వెళ్ళాలనే ఆలోచన మానుకుంటున్నారు. దీంతో డిజిటల్ రిలీజ్ విషయంలో ఎంత గ్యాప్ ఉండాలనే చర్చ చాలా రోజుల నుండి సాగుతోంది. తాజాగా ఈ విషయంపై చర్చించిన తెలుగు నిర్మాతల మండలి థియేట్రికల్ రిలీజ్ అయిన ఎనిమిది వారాల తర్వాతే డిజిటల్ రిలీజ్ ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయం పెద్ద స్టార్ హీరోల సినిమాలకంటే మీడియం.. చిన్న బడ్జెట్ చిత్రాలకు లాభం కలిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంతో డిస్ట్రిబ్యూటర్లు.. బయ్యర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త నిర్ణయంతో సినిమా రిలీజ్ తర్వాత ఎనిమిది వారాలు వెయిట్ చేస్తేనే గానీ డిజిటల్ ప్లాట్ ఫాం లో అందుబాటులోకి రాదు. రెండు మూడు వారాలకే ఇంట్లో కూర్చొని కొత్త సినిమా చూడడానికి అలవాటు పడ్డ ప్రేక్షకులకు ఇది కాస్త నిరాశ కలిగించే అంశమే.