Begin typing your search above and press return to search.

బెదిరింపు కేసు.. నిర్మాత‌ల‌కు ఊర‌ట‌

By:  Tupaki Desk   |   30 May 2019 6:26 AM GMT
బెదిరింపు కేసు.. నిర్మాత‌ల‌కు ఊర‌ట‌
X
ద‌శాబ్ధం త‌ర్వాత కూడా ఖ‌లేజా- కొమ‌రం పులి (2010) చిత్రాల గురించి మాట్లాడుకుంటున్న అరుదైన‌ సంద‌ర్భ‌మిది. ఆ రెండు సినిమాల‌ను సంగ‌న‌మ‌ల ర‌మేష్ నిర్మించారు. వీటికి సి.క‌ళ్యాణ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌గా కొన‌సాగారు. అయితే అప్ప‌ట్లోనే స‌ద‌రు నిర్మాత‌లపై షాలిమ‌ర్ వీడియోస్ కంపెనీస్- యూనివ‌ర్శ‌ల్ హోమ్ ఎంట‌ర్ టైన్ మెంట్ సంస్థ‌లు ఓ డీల్ విష‌యంలో త‌లెత్తిన వివాదంపై సీఐడీ కోర్టుకు వెళ్లాయి. రెండు ప్రముఖ వీడియో డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీలతో స‌ద‌రు నిర్మాత‌ల వివాదం ద‌శాబ్ధ కాలంగా న‌లుగుతూనే ఉంది.

ఆ రెండు సినిమాల డీవీడీ-వీసీడీ రైట్స్ విష‌యంలో విభేధాలు త‌లెత్త‌డంతో త‌మ‌పైకి భానుకిర‌ణ్ అనే ప్ర‌మాద‌క‌ర‌ గ్యాంగ్ స్ట‌ర్ ని ఉసిగొల్పి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డార‌ని స‌ద‌రు కంపెనీలు నిర్మాత‌ల‌పై ఆరోపించాయి. అంతేకాదు భానుకిర‌ణ్ సార‌థ్యంలో త‌మ‌ను పిలిచి ఫిజిక‌ల్ గా కొట్టార‌ని ఆరోపిస్తూ సీఐడీ కోర్టుకు నివేదించారు. 2011 నుంచి ఈ వివాదం కోర్టుల ప‌రిధిలో న‌లుగుతోంది. డీవీడీ- సీడీ రైట్స్ విష‌య‌మై చేసుకున్న ఒప్పందాన్ని స‌ద‌రు కంపెనీలు మీరాయ‌ని.. త‌మ‌కు చెల్లించాల్సిన సొమ్ముల్ని చెల్లించ‌లేద‌ని సింగ‌న‌మ‌ల‌- సి.క‌ళ్యాణ్ బృందం అప్ప‌ట్లో ప్ర‌త్యారోప‌ణ‌లు చేసింది. కోర్టులో త‌మ‌ని డిపెండ్ చేసుకుంటూ వాద‌న‌లు వినిపించారు.

ఖ‌లేజా - కొమ‌రం పులి డీవీడీ- వీసీడీ రైట్స్ ని ఒక్కొక్క‌టి 52.50 ల‌క్ష‌లు చొప్పున షాలిమ‌ర్- యూనివ‌ర్శ‌ల్ హోమ్స్ బృందం బేరం ఆడుకున్నారు. రెండు ద‌ఫాలుగా 22.25 ల‌క్ష‌లు చొప్పున చెల్లించాల్సి ఉండ‌గా ఆ మేర‌కు చెక్ లు ఇచ్చేందుకు అంగీక‌రించార‌ని సి.క‌ళ్యాణ్ బృందం వాదించింది. అయితే ఈ డీల్ విష‌యంలో తలెత్తిన వివాదం కోర్టుల ప‌రిధికి వెళ్లింది. ప‌లుమార్లు విచార‌ణ సాగింది. అయితే సింగ‌న‌మ‌ల‌- సి.క‌ళ్యాణ్ బృందం త‌మ‌ని గ్యాంగ్ స్ట‌ర్ భాను స‌మ‌క్షంలో వేధింపుల‌కు పాల్ప‌డిన దానికి సంబంధించి ఎలాంటి ఆధారాల్ని స‌ద‌రు కంపెనీలు కోర్టుకు స‌మ‌ర్పించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయి. దీంతో తాజా తీర్పులో న్యాయ‌మూర్తులు ఈ కేసును కొట్టి వేశామ‌ని ప్ర‌క‌టించారు. మొత్తానికి ద‌శాబ్ధ కాలంగా న‌లుగుతున్న ఈ కేసు నుంచి సింగ‌న‌మ‌ల‌- సి.క‌ళ్యాణ్ బ‌య‌ట‌ప‌డ్డారు.