Begin typing your search above and press return to search.

థియేటర్ల పునః ప్రారంభం విషయంలో నిర్మాతల ప్లాన్‌

By:  Tupaki Desk   |   30 Oct 2020 5:55 PM GMT
థియేటర్ల పునః ప్రారంభం విషయంలో నిర్మాతల ప్లాన్‌
X
కరోనా కారణంగా మార్చి నుండి థియేటర్లు పూర్తి స్థాయిలో మూత పడ్డాయి. ఎనిమిది నెలలుగా థియేటర్లకు ఇన్‌ కమ్‌ జీరో. ఇలాంటి సమయంలో కేంద్రం నుండి థియేటర్ల ఓపెన్‌ కు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. అయినా కూడా థియేటర్ల యాజమాన్యాలు మాత్రం ఓపెన్‌ కు సుముఖత వ్యక్తం చేయడం లేదు. థియేటర్లు ఓపెన్‌ చేయాలన్నా సినిమాలేవి కూడా విడుదలకు సిద్దం లేక పోవడంతో యాజమాన్యాలు ఆలోచనలో పడ్డారు. థియేటర్ల యాజమాన్యాలు మరియు నిర్మాతలు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి థియేటర్ల పునః ప్రారంభంకు నిర్ణయం తీసుకుంటే బెటర్‌ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క సారే సినిమాలను విడుదల చేయకుండా చిన్న సినిమాలను పక్కన పెట్టి మొదటి రెండు మూడు వారాల పాటు మీడియం రేంజ్‌ సినిమాలను వారంలో రెండు లేదా మూడింటిని విడుదల చేస్తూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం నిర్మాతలు మరియు థియేటర్ల యాజమాన్యాలు చర్చించాల్సి ఉంది. డిసెంబర్‌ రెండవ వారం నుండి థియేటర్ల పునః ప్రారంభంకు ఏర్పాట్లు చేస్తున్నారు. మీడియం రేంజ్‌ బడ్జెట్‌ సినిమాలు.. ఒక మోస్తరు క్రేజ్‌ ఉన్న హీరోల సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నారు.

సంక్రాంతి వరకు ప్రేక్షకులు పూర్తి స్థాయిలో సినిమా థియేటర్లకు వచ్చేలా మళ్లీ పరిస్థితి కల్పించాలని నిర్మాతలు భావిస్తున్నారు. జనవరి మొదటి మరియు రెండవ వారంలో భారీ సినిమాలు స్టార్‌ హీరోల సినిమాలు రెండు మూడు చిన్న హీరోల సినిమాలు కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీతో అయినా అన్నింటిని ఓపెన్‌ చేయాలని భావిస్తున్నారు.

థియేటర్లకు మళ్లీ జనాలు క్యూ కట్టాలంటే ఖచ్చితంగా మంచి సినిమాలు అయితేనే జనాలు వస్తారు. కనుక మొదటి రెండు మూడు వారాల పాటు ఆచి తూచి మంచి సినిమాలను ఎంపిక చేసి విడుదల చేయాలనే చర్చ కూడా ఇండస్ట్రీ పెద్దల్లో జరుగుతుంది. మొత్తానికి ఇండస్ట్రీకి చెందిన ఓ పది మంది ప్రముఖులు ముందుకు వచ్చి ఈ విషయమై చర్చించాల్సిన సమయం వచ్చింది. కొందరు నిర్మాతల వద్ద ఎలాగూ థియేటర్లు ఉన్నాయి. వారు మరియు కొందరు ఫిల్మ్‌ మేకర్స్‌ ముందుకు వచ్చి థియేటర్ల వారితో చర్చించి ఈ సమస్యకు పరిష్కారంను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.