Begin typing your search above and press return to search.

నిర్మాతల స్ట్రైక్.. ఎవరి మీద?

By:  Tupaki Desk   |   19 July 2022 2:30 AM GMT
నిర్మాతల స్ట్రైక్.. ఎవరి మీద?
X
టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సంచలన నిర్ణయాలకు సిద్ధమవుతున్నట్లుగా మీడియాలో జోరుగా ప్రచారం జరగబోతోంది. సినీ పరిశ్రమలోని కార్మికులు తమ డిమాండ్లతో స్ట్ర్రైక్‌కు వెళ్లడం మామూలే కానీ.. ఈసారి దీనికి భిన్నంగా నిర్మాతలే సమ్మెకు దిగబోతున్నారని, షూటింగ్‌లు ఆపేయబోతున్నారని వార్తలొస్తున్నాయి.

కొవిడ్ తర్వాత సినిమాల నిర్మాణం చాలా భారంగా మారిపోవడం, అందరూ పారితోషకాలు పెంచేసి నిర్మాణ వ్యయం బాగా పెరిగిపోవడం, అదే సమయంలో వసూళ్లు పడిపోయి ఆదాయం తగ్గిపోతుండడంతో నిర్మాతల పరిస్థితి దారుణంగా తయారైందన్నది ‘గిల్డ్’ ఆవేదన. వారి వాదన సరైందే.. ఆవేదన నిజమే. సినీ నిర్మాణం చాలా చాలా ప్రమాదకరంగా మారిన మాట వాస్తవం.

కానీ దీనికి ప్రధానంగా బాధ్యత వహించాల్సింది కూడా నిర్మాతలే అన్నది అంగీకరించాల్సిన వాస్తవం. మెజారిటీ నిర్మాతలు సినిమాలు తీసే విధానమే మారిపోవడమే ఈ సమస్యకు మూల కారణం.

ఒకప్పట్లా ముందు కథ తయారు చేసుకుని, దర్శకుడిని, హీరోను ఎంచుకుని.. బడ్జెట్ ప్రణాళికలు వేసుకుని అందుకు తగ్గట్లుగా పారితోషకాలు ఫిక్స్ చేసుకుని రంగంలోకి దిగే నిర్మాతలు ఎంతమంది అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం.

ముందు హీరో వెంటపడి, కాకా పట్టి డేట్లు సంపాదించడం.. వారు ఎంత డిమాండ్ చేస్తే అంత పారితోషకానికి ఓకే చెప్పి, అడ్వాన్స్ ఇచ్చేయడం.. ఆ తర్వాత దర్శకుడి ఎంచుకోవడం.. ఈ కాంబినేషన్ చూపించి అడ్వాన్సులు పుచ్చుకోవడం.. ఆపై కథ కోసం వెతుకులాడడం.. కుదిరినపుడు సినిమా చేయడం ఇదీ వరస.

స్టార్ హీరోల గత సినిమాలతో సంబంధం లేకుండా వారి పారితోషకాలు పెంచి, అడ్వాన్సులిచ్చి డేట్లు సంపాదించడమే ఇప్పుడు ప్రధానంగా నిర్మాతలు చేస్తున్న అతి పెద్ద తప్పు. దీని మూలంగానే హీరోలు కొండెక్కి కూర్చుంటున్నారు. మిగతా అందరి రెమ్యూనరేషన్, సినిమాలకు అయ్యే మిగతా ఖర్చు కంటే కూడా హీరో పారితోషకం ఎక్కువ ఉంటోందంటే అతిశయోక్తి కాదు.

ఈ పరిస్థితి తెచ్చిందే నిర్మాతలు. ఇప్పుడు పారితోషకాలు పెరిగిపోయాయని, సినిమా నిర్మాణం భారంగా మారిందని, పరిస్థితి ఘోరంగా తయారైందని బాధ పడితే దానికి బాధ్యత వహించాల్సింది కూడా చాలా వరకు నిర్మాతలే అన్నది కఠిన వాస్తవం.