Begin typing your search above and press return to search.

కమీషన్‌ లో వాట!.. బుక్ మై షో తో నిర్మాతల వివాదం

By:  Tupaki Desk   |   21 Feb 2022 3:42 AM GMT
కమీషన్‌ లో వాట!.. బుక్ మై షో తో నిర్మాతల వివాదం
X
ఈమద్య కాలంలో సినిమా టికెట్లు అత్యధికంగా ఆన్ లైన్ లోనే బుక్‌ అవుతున్నాయి. థియేటర్‌ కౌంటర్ వద్ద చాలా తక్కువ మొత్తంలోనే వసూళ్లు అవుతున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాలు మరియు ప్రధాన పట్టణాల్లో ఆన్ లైన్ బుకింగ్‌ అత్యధికంగా జరుగుతుంది. థియేటర్‌ బుకింగ్‌ రేటుకు కొంత మొత్తం అదనంగా కమీషన్ రూపంలో ఆన్ లైన్ టికెట్ ప్లాట్‌ ఫామ్‌ తీసుకుని ప్రేక్షకులకు టికెట్లను ఇవ్వడం జరుగుతుంది.

ఆన్ లైన్ టికెట్‌ ప్లాట్‌ ఫామ్స్ చాలా ఉన్నాయి. అందులో బుక్ మై షో ప్రధానమైనది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అత్యధికంగా ఆధరణ కలిగి ఉన్న బుక్‌ మై షో తో తెలుగు నిర్మాతల వివాదం కొనసాగుతోంది. ఇటీవల టికెట్ల రేట్లు భారీగా పెరిగాయి. ఆ టికెట్ల రేట్లు భారీగా పెరుగుదలతో బుక్ మై షో లో టికెట్ల పై తీసుకునే కమిషన్ ను కూడా ఆ స్థాయిలోనే పెరిగింది. దాంతో ప్రేక్షకులపై డబుల్ భారం పడుతుంది.

ఈ సమయంలో బుక్ మై షో వసూళ్లు చేస్తున్న కమిషన్ విషయమై నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే బుక్‌ మై షో కు చాలా కమీషన్ వెళ్తుంది. ఇప్పుడు టికెట్ల రేట్లు పెరగడం వల్ల మరింత కమీషన్‌ వారికి వెళ్తుంది. ఇప్పటికే టికెట్ల రేట్లు పెరగడం వల్ల జనాలు థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. టికెట్ల రేట్లకు అదనంగా కమిషన్ ను భారీగా వసూళ్లు చేయడంను నిర్మాతలు తప్పుబడుతున్నారు. ఆన్ లైన్ టికెట్‌ బుకింగ్ వ్యవస్థ శాపంగా మారిందంటూ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రేక్షకుల నుండి వస్తున్న కమీషన్‌ తగ్గించాలి లేదంటే మెల్ల మెల్లగా ఆన్ లైన్ బుకింగ్‌ విధానంను తొలగిస్తామని.. ప్రభుత్వం స్వయంగా ఆన్ లైన్ ద్వారా టికెట్లను అమ్మే విధానం ను తీసుకు వస్తామని నిర్మాతలు హెచ్చరిస్తున్నారు. కాని ఆ సంస్థ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. దేశవ్యాప్తంగా ఎలాంటి పద్దతి అయితే ఉందో అలాంటిదే ఇక్కడ మేము అమలు చేస్తాం. ఇక్కడ కొత్త పద్దతిలో వ్యాపారం చేయలేం అన్నట్లుగా బుక్‌ మై షో వాదనకు దిగిందట.

నిర్మాతలు ఎట్టి పరిస్థితుల్లో బుక్‌ మై షో కు అంతటి లాభాల వాటాను పోనివ్వలేం అంటూ పట్టుదలతో ఉన్నారట. దాంతో భీమ్లా నాయక్‌ సినిమా ను బుక్‌ మై షో కు బుకింగ్‌ చేసే అవకాశం ఇవ్వలేదనే టాక్‌ వినిపిస్తుంది. నిర్మాతలు మరియు బుక్ మై షో సంస్థల మధ్య వివాదం మరింతగా పెరిగింది. ఈ వివాదం ఎక్కడి వరకు దారి తీస్తుంది అనేది చూడాలి. బుక్ మై షో కు బాగా అలవాటు పడ్డ ప్రేక్షకులు భీమ్లా నాయక్ బుకింగ్‌ లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలో మరో పుకారు ఒకటి షికారు చేస్తోంది. ప్రేక్షకుల నుండి ముక్కు పిండి వసూళ్లు చేసిన కమిషన్ నుండి తమకు వాటా కావాలని నిర్మాతలు డిమాండ్‌ చేస్తున్నారని.. మొత్తం కమిషన్ బుక్ మై షో తీసుకోవడం నిర్మాతలకు నచ్చడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ కమీషన్‌ లో మాకు వాటా కావాలని నిర్మాతలు డిమాండ్‌ చేస్తున్నారు అనేది తాజా పుకారు.

ఈ విషయమై నిర్మాతలు అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇంత భారీ కమీషన్ పెట్టి ఆన్ లైన్ లో బుక్‌ చేసుకోవడం కంటే నేరుగా కాస్త కష్టం అయినా థియేటర్ లేదా మల్టీ ప్లెక్స్ కు వెళ్లి టికెట్లను తీసుకోవడం ఉత్తమం కదా అంటున్నారు. వీరి మధ్య వివాదం ప్రేక్షకులపై ఉన్న భారం ను తగ్గించేదిగా ఉంటే బాగుంటుందని.. ఈ విషయమై ఇండస్ట్రీ పెద్దలు చర్చించాలంటూ ప్రేక్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు.