Begin typing your search above and press return to search.

కొత్త స్టార్.. మల్లెపుష్పం రామారావు

By:  Tupaki Desk   |   27 Dec 2015 5:30 PM GMT
కొత్త స్టార్.. మల్లెపుష్పం రామారావు
X
‘రెడీ’లో చారి.. ‘కృష్ణ’లో బాబి.. ‘కింగ్’లో జయసూర్య.. ‘అత్తారింటికి దారేది’లో బద్ధం భాస్కర్.. ఇలా ఒకటా రెండా.. బ్రహ్మానందం పోషించిన పాత్రలు ఎన్నో ఎన్నెన్నో ప్రేక్షకుల మనసుల్లో ముద్రించుకుపోయాయి. ఐతే ఈ మధ్య బ్రహ్మి పాత్రలు అంతగా గుర్తుండట్లేదు కానీ.. పృథ్వీ క్యారెక్టర్లు మాత్రం ఇలాగే జనాల మనసుల్లో రిజిస్టర్ అయిపోతున్నాయి. గత ఏడాది ‘లౌక్యం’ సినిమాలో అతను పోషించిన బాయిలింగ్ స్టార్ బబ్లూ క్యారెక్టర్ ఓ రేంజిలో పేలింది. ఇక ఈ నెలలో అయితే ఒకదాని తర్వాత ఒకటి పేలిపోయే క్యారెక్టర్లు పడుతున్నాయి పృథ్వీకి.

‘శంకరాభరణం’లో పర్సంటేజ్ పరమేశ్ సందడి చేస్తే.. ‘బెంగాల్ టైగర్’లో ఫ్యూచర్ స్టార్ సిద్ధప్ప కూడా అంతే హంగామా చేశాడు. తాజాగా ‘భలే మంచి రోజు’లో వీటికి మించిన క్యారెక్టర్ పడింది పృథ్వీకి. జూనియర్ ఆర్టిస్టు మల్లెపుష్పం రామారావుగా పృథ్వీగా చెలరేగిపోయాడు. ఇంట్రడక్షన్ సీన్ లోనే తనదైన శైలిలో నవ్వించిన పృథ్వీ.. క్లైమాక్స్ లో వచ్చి అందర్నీ పక్కకు నెట్టేసి స్క్రీన్ మొత్తాన్ని ఆక్రమించేశాడు. ఈ ఒక్క సీన్ కోసం టికెట్ డబ్బులు పెట్టేయొచ్చు అనేలా పేలింది ఈ సీన్. పోలీస్ క్యారెక్టర్లు వేసిన హీరోల్ని అనుకరిస్తూ చెప్పిన పేరడీ డైలాగులు అదిరిపోయాయి. అందులోనూ చివర్లో సాయికుమార్ ముందు సాయికుమార్‌ నే ఇమిటేట్ చేసి.. ఎవరో చెప్పు అని అడగడం.. అతను సాయికుమార్ అని బదులిస్తే.. కాదు రాజశేఖర్ అంటూ ఝలక్ ఇవ్వడం.. మొత్తంగా థియేటర్లలో నవ్వులే నవ్వులు. పృథ్వీ క్యారెక్టర్ ఎంతగా పేలిందంటే.. సినిమా ప్రమోషన్లకు ఈ క్యారెక్టర్నే వాడేస్తున్నారు. ‘మల్లెపుష్పం రామారావు హిలేరియస్ యాక్ట్’ అంటూ పోస్టర్ల మీద ముద్రిస్తున్నారు. దీన్ని బట్టే ఆ క్యారెక్టర్ ఏ స్థాయిలో పేలిందో అర్థం చేసుకోవచ్చు.