Begin typing your search above and press return to search.

టాలీవుడ్ పెద్దలను బుక్ చేసిన ఫృథ్వీ

By:  Tupaki Desk   |   28 May 2019 7:26 AM GMT
టాలీవుడ్ పెద్దలను బుక్ చేసిన ఫృథ్వీ
X
30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫృథ్వీ చెలరేగిపోయాడు.. సడన్ గా టాలీవుడ్ మీద పడ్డారు. టాలీవుడ్ వివక్షతను ఎత్తి చూపించారు. పదునైన విమర్శలతో టాలీవుడ్ పెద్దలను తీవ్రంగా ఇరుకునపెట్టాడు. ఏపీలో అధికారం మారినవేళ టాలీవుడ్ పెద్దలు పట్టించుకోని వైనాన్ని ఏకిపారేశాడు. ఫృథ్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తున్నారు. తమ అధినేత జగన్ కు కొండంత బలాన్ని ఇచ్చి ప్రజలు గెలిపించినా టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు పట్టించుకోకపోవడంపై బహిరంగంగానే తన ఆవేదన వ్యక్తం చేశాడు. పేర్లు ప్రస్తావించి మరీ సినిమా పెద్దలపై తన అక్కసును వెళ్లగక్కారు.

సినిమా పెద్దలపై తాను చేస్తున్న విమర్శలకు తనకు సినిమా అవకాశాలు రాకున్నా ఫర్వాలేదని.. జగన్ ను మాత్రం వీరు అభినందించకపోవడం అంతటా విమర్శలకు దారితీస్తోందని ఫృథ్వీ దుయ్యబట్టారు.

ఫృథ్వీకి ఓ వైసీపీ అభిమాని పెట్టిన పోస్టును తన వాట్సాప్ స్టేటస్ గా పెట్టాడు. అందులో చిరంజీవి - అల్లు అరవింద్ - రాఘవేంద్రరావు - సురేష్ బాబులను ప్రస్తావిస్తూ వారు చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు ఎదురెళ్లి మరీ బోకెలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పిన వైనాన్ని.. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక ప్రవర్తిస్తున్న తీరును ఫృథ్వీ ఎండగట్టారు. ప్రత్యేక విమానాలు తీసుకొని మరీ చంద్రబాబును గద్దెనెక్కక ముందే వెళ్లి వీరు అభినందించారని.. కనీసం జగన్ కు ప్రకటనలోనైనా శుభాకాంక్షలు చెప్పడం లేదని దుయ్యబట్టారు.

జగన్ కు వీళ్ల అభినందనలు అక్కర్లేదని.. కానీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్లుగా మేం కోరుకుంటున్నామని.. పెద్దవాళ్లుగా చెప్పుకుంటున్న సినీ ప్రముఖులు జగన్ కు శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉందని ఫృథ్వీ విమర్శించారు. బొడ్డు మీద బొప్పాయిలు కొట్టే ఎన్వీబీసీ చైర్మన్ అయిన రాఘవేంద్రరావుకు కూడా జగన్ గెలుపు కనిపించలేదా అని ప్రశ్నించారు. ఇక స్వామి మాల వేసుకొని బాబును ఆరాధించిన సురేష్ బాబు కు కూడా జగన్ గెలుపును పట్టించుకోరా.? అని నిలదీశారు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ రాజ్యంలో కలిపిన చిరంజీవికి జగన్ గెలుపు వార్త చెవిన పడలేదా అని విమర్శించారు. నిర్మాతలకే నిర్మాత అయిన అల్లు అరవింద్ కు ఇంకా జగన్ గెలుపు వార్త ఎవరూ చెప్పినట్టు లేదని తీవ్రంగా దుయ్యబట్టారు ఫృథ్వీ..జగన్ కు శుభాకాంక్షలు చెప్పడం వల్ల ఇండస్ట్రీ ప్రతిష్ట పెరుగుతుందని సూచించారు.

ఇక చంద్రబాబు ఈసారి గెలిస్తే తనను జైలుకు పంపి బెయిల్ ఇవ్వకుండా చేస్తానన్నారని.. కానీ తాను భయపడకుండా వైసీపీ తరుఫున క్యాంపెయిన్ చేశానని చెప్పుకొచ్చాడు. తాను సినీ పెద్దలను అన్నందుకు సినిమా అవకాశాలు కూడా ఇవ్వరని.. కానీ తాను సినిమాల్లో ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతకలేదని పృథ్వీ స్పష్టం చేశారు.