Begin typing your search above and press return to search.

'PS-1' థియేటర్ ఓనర్స్ కు బెదిరింపులు..!

By:  Tupaki Desk   |   28 Sep 2022 4:30 PM GMT
PS-1 థియేటర్ ఓనర్స్ కు బెదిరింపులు..!
X
లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా "పొన్నియన్ సెల్వన్ 1" విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 30వ తారీఖున పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే ఈ చిత్రాన్ని ప్రదర్శనను అడ్డుకోడానికి థియేటర్ యజమానులకు బెదిరింపులు వస్తున్నాయనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. 'PS-1' సినిమాని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. మనదేశంలో కంటే కొన్ని గంటల ముందుగానే యూఎస్ఏలో ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. అలానే కెనడాలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అయితే అక్కడ కొందరు విధ్వంసకారులు ఈ సినిమా రిలీజ్ ను అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

నివేదికల ప్రకారం, 'పొన్నియన్ సెల్వన్‌' సినిమాని ప్రదర్శిస్తే.. థియేటర్‌ల మీద దాడి చేసి స్క్రీన్‌లను చింపివేస్తామని.. థియేటర్లను ధ్వంసం చేస్తామని కెనడాలోని కొందరు మత ఛాందసవాదులు మరియు విధ్వంసకారులు థియేటర్ యజమానులను బెదిరించారని తెలుస్తోంది. సిబ్బందిపై దాడి చేస్తామని హెచ్చరించారు.

హామిల్టన్ - కిచెనర్ మరియు లండన్‌ లలోని ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. దీంతో థియేటర్ యజమానులు స్థానిక పోలీసులను ఆశ్రయించారని తెలుస్తోంది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్న అధికారులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటామని థియేటర్ యాజమాన్యాలకు హామీ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఏదేమైనా కెనడా వంటి ప్రజాస్వామ్య దేశంలో సినిమాల రిలీజులప్పుడు ఇలా బెదిరింపులు రావడం.. థియేటర్ కు వెళ్లి సినిమా చూడటానికి ఆలోచించాల్సిన పరిస్థితి రావడం విచారకరం. నిజానికి గతంలో కూడా అనేక తమిళ చిత్రాలకు కెనడాలో బెదిరింపులు ఇలాంటి వచ్చాయి. ఇప్పుడు 'పొన్నియిన్ సెల్వన్' కి కూడా బెదిరింపులు తప్పలేదు. మరి సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

కాగా, మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పబడుతున్న 'పీఎస్ 1' సినిమాపై తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇది సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దాదాపు 10 కోట్లకు తీసుకున్నట్లు టాక్. అయితే అడ్వాన్స్ బేసిస్ మీద ఈ సినిమాను విడుదల చేయనున్నారని తెలుస్తోంది.

‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో విక్రమ్ - ఐశ్వర్యరాయ్ - త్రిష - కార్తీ - జయం రవి - శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రకాష్ రాజ్ - ప్రభు - విక్రమ్ ప్రభు - ఐశ్వర్య లక్ష్మీ - శరత్ కుమార్ - జయరామ్ - రెహమాన్ - రాధాకృష్ణన్ పార్థీవన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

లైకా ప్రొడక్షన్స్ మరియు మణిరత్నం మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

ప్రసిద్ధ రచయిత కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా చోళుల కాలం నాటి కథాంశంతో 'పొన్నియన్' సినిమా తెరకెక్కింది. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించాలని ప్లాన్ చేయగా.. ఫస్ట్ పార్ట్ ని 'PS 1' పేరుతో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. రెండో భాగాన్ని మరో తొమ్మిది నెలల తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని దర్శకుడు మణిరత్నం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.