Begin typing your search above and press return to search.

పార్ట్ 2 హైప్ కోస‌మే ఇదంతా చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   11 Oct 2022 2:30 AM GMT
పార్ట్ 2 హైప్ కోస‌మే ఇదంతా చేస్తున్నారా?
X
మణిరత్నం దర్శకత్వం వహించిన `పొన్నియిన్ సెల్వన్` వారం రోజుల క్రితం విడుదలైంది. అయితే ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావ‌రేజ్ టాక్ తెచ్చుకుంది. ఒక న‌వ‌ల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో పాత్ర‌ల గ‌జిబిజిపైనా హీరోయిజంపైనా చాలా విమ‌ర్శ‌లొచ్చాయి. ఆదిత్య కరికాలన్ గా చియాన్ విక్రమ్.. వంతీయతేవన్ గా కార్తీ, .. కుందవాయిగా త్రిష ..క్వీన్ నందినిగా ఐశ్వర్యరాయ్ బచ్చన్ తో పాటు జయం రవి అరుల్మొళి వర్మన్ గా నటించ‌గా వారి న‌ట‌న‌కు ప్ర‌శంస‌లొచ్చాయి. కానీ పాత్ర‌ల తీరుతెన్నుల‌ను విమ‌ర్శించ‌ని వాళ్లు లేరు.

ఈ సినిమాలో రాజ‌సం ఎంత వెతికినా క‌నిపించ‌ద‌న్న విమ‌ర్శ ఉంది. విరోచిత పోరాటాలు అయితే అస‌లే క‌నిపించ‌వు. బాహుబ‌లి - బాహుబ‌లి 2- ఆర్.ఆర్.ఆర్ లాంటి మ్యాసివ్ యాక్ష‌న్ సినిమాలు చూసిన ఆడియెన్ కి పొన్నియ‌న్ సెల్వ‌న్ ఏమంత రుచించ‌లేదు. మ‌ణిర‌త్నం మార్క్ ట్రీట్ మెంట్ లో కూడా లోపాలు ఇటు తెలుగు ఆడియెన్ కి న‌చ్చ‌లేదు. కానీ పీఎస్ 1 బంప‌ర్ హిట్టు అంటూ సాగుతున్న ప్ర‌చారం ఒక‌ర‌కంగా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. కొన్ని ప్ర‌ముఖ బాలీవుడ్ వెబ్ సైట్ల‌లో ఈ మూవీ 350 కోట్ల క్ల‌బ్ లో చేరింద‌ని 400 కోట్ల వైపు దూసుకెళుతోంద‌ని కూడా క‌థ‌నాలు వేయించారు. అయితే ఇవ‌న్నీ వాస్త‌వ లెక్క‌లేనా కాదా? అన్న‌దానికి స‌రైన ఆధారాలు లేవు. ఇక‌పోతే ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల నుంచి క‌నీసం 10 కోట్ల షేర్ కూడా వ‌సూల‌వ్వ‌క‌పోవ‌డం తంబీల‌కు ఆగ్ర‌హం తెప్పించిందిట‌.

త‌మిళ‌నాడులో పొన్నియ‌న్ సెల్వ‌న్ సెంటిమెంటుగా వ‌ర్క‌వుటైనా కానీ అది తెలుగు ఆడియెన్ కి ఏమాత్రం క‌నెక్టింగ్ గా లేక‌పోవ‌డంతో ఆశించినంత విజ‌యం సాధించ‌లేదు. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద 9 రోజుల తర్వాత పొన్నియిన్ సెల్వన్ రూ. 350 కోట్లు ప్రపంచవ్యాప్తంగా వ‌సూలు చేసింద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా 1శాతం కూడా లేదు. మొదటి వారం ముగిసే సమయానికి రెండవ వారంలోను క‌లెక్షన్లు స్థిరంగా కొనసాగాయ‌ని వ‌ర‌ల్డ్ వైడ్ గా 10వ‌రోజుకు 15కోట్ల రేంజు వ‌సూలు చేస్తోందంటూ కొన్ని లెక్క‌లు చెప్ప‌డం విస్మ‌య‌ప‌రుస్తున్నాయి. నిజానికి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల‌లో అంతంత‌మాత్రంగానే ఆడింది.

కానీ రెండవ వారం చివరి నాటికి వ‌ర‌ల్డ్ వైడ్ గా 400కోట్లు వ‌సూలు చేసేస్తుందంటూ ఒక సెక్ష‌న్ మీడియా ప్ర‌చారం సాగిస్తోంది. పొన్నియిన్ సెల్వన్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ లెక్క‌లు చెబుతూ...1వ వారం - రూ. 308.59 కోట్లు...8వ రోజు - రూ. 15.47 కోట్లు ..9వ రోజు - రూ. 26.72 కోట్లు.. మొత్తం - రూ. 350.78 కోట్లు వ‌సూలైందంటూ లెక్క‌లు చెబుతున్నారు.

అయితే ఇదంతా కేవ‌లం మీడియాలో హైప్ మాత్ర‌మేన‌ని ఒక సెక్ష‌న్ విశ్లేష‌కులు అంటున్నారు. పొన్నియ‌న్ సెల్వ‌న్ 1 తో పాటు పార్ట్ 2 ని కూడా ఇప్ప‌టికే మ‌ణిర‌త్నం పూర్తి చేసేశారు. రెండో భాగానికి హైప్ పెంచి భారీ బిజినెస్ చేయాల‌నేది ప్లాన్. అందుకే కొన్ని బాలీవుడ్ మీడియాలతో ప‌నిగ‌ట్టుకుని ఇలా ప్ర‌చారం చేయిస్తున్నారంటూ ఇటు తెలుగు మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి.

ఆస‌క్తిక‌రంగా బాహుబ‌లి కానీ కేజీఎఫ్ కానీ సీక్వెల్ ని దృష్టిలో పెట్టుకుని తెర‌కెక్కించ‌లేదు. మొద‌టి భాగం చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే రెండో భాగానికి ఆలోచ‌న‌లు పుట్టుకొచ్చాయి. ఆ త‌ర్వాత అవ‌స‌రం మేర సీక్వెల్ కోసం క‌థ‌ల‌ను పొడిగించారు. త‌ర‌వాత బ‌డ్జెట్ల ప‌రంగా కాన్వాసును అమాంతం పెంచి భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ల‌తో ర‌క్తి క‌ట్టించారు. అలాంటిదేమీ లేకుండానే మ‌ణిర‌త్నం పీఎస్ 2 ని ముందుగానే పూర్తి చేసి ఇప్పుడిలా అనూహ్యంగా హైప్ పెంచ‌డం ద్వారా ఏం చేయ‌ద‌లిచారో అంటూ ఒక సెక్ష‌న్ విమ‌ర్శ‌కులు విరుచుకుప‌డుతున్నారు. దీనికి చిత్ర‌బృందం నుంచి ఎలాంటి ఆన్స‌ర్ వస్తుందో వేచి చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.